ఈ పుట ఆమోదించబడ్డది

వీనికి సవతిసోదరుడయిన సోమదేవరాజు లీసమాచారము దెలియరాగా నన్నదమ్ము లిరువురును విశేషసైన్యముల సమకూర్చుకొని కొటిగంటిరాఘవుడు కంపిలిదుర్గమును, మల్లికునాయబు సైన్యములను, సోమదేవుడు మహమ్మదుబీన్‌తుఘ్‌లఖ్ సైన్యములను ముట్టడించి ఘోరసంగ్రామము సలిపియుందురు.

కంపిలిరాయ డయినమల్లిక్‌నాయబుని సైన్యముల నెదుర్కొని యుద్ధముచేసి యపారవిజయమును గాంచి వానిని దేశమునుండి తరుమగొట్టి 'గండరగూళి' యనుబిరుదమును బొందినవీరయువకుడు కొటిగంటిరాఘవరాజేగాని యన్యుడు గాడని తలంపవలసి యుండును. రాఘవరాజు కొటిగల్లుదుర్గమును స్వాధీనపఱచుకొని నద్దుర్గాక్షుడుగ నుండుటచేతనే కొటిగంటిరాఘవరా జనిద్విపదబాలభాగవతమున బేర్కొన బడుట సంభవించెను. ఇతడువహించిన 'గండరగూళి' యను బిరుదమునే వీనితరువాత నళియరామరాజు పెదతండ్రియగు నవుకుతిమ్మరాజువహించియున్నటుల "సంగరాంగణ చర్యకంపిలిరాయ సప్తాంగగండరగూళి నద్బిరుదాది సంగ్రహ్రణోజ్జ్వలా" యనుపద్య బాలభాగవతములోని వాక్యమువలన గన్పట్టుచున్నది. ఈతిమ్మరాజుకాలమున కంపిలిరాజ్యము లేదు. కావున నిత డారాజ్యమును జయించి సాధించినబిరుదము గాదు. అయినను పూర్వులువహించినబిరుదముల గూడవంశపారంపర్యముగ దత్సంతతులవారు వహించుట గలదనిసమన్వయించు కొనవలయును.