ఈ పుట ఆమోదించబడ్డది

శరణు వేడగా నాతడు సంధి కొప్పుకొనియెను. ఈసంధికార్యము 1545 సంవత్సరములో జరిగియుండు నని నాయభిప్రాయము. తుదకు ఫలితమేమనగా తిరువడిరాజ్యాధిపతియైన రామవర్మ తిరువణిదేశము (తిన్నెవెల్లిమండలము) విజయనగరసామ్రాజ్యమున కొసంగుటకును,ఎప్పటివలె దానుబ్రతిసంవత్సరము సామ్రాజ్యమునకు గప్పము చెల్లించుటకును, ఇకముందెన్నడు విజయనగరమువారు తిరువడిరాజ్యముపై దండయాత్ర నెఱపి యలజడి పుట్టింప కుండుటకును నొప్పుకొని తానుస్వయముగా తిన్నెవెల్లికివెళ్లి విఠ్ఠలునిసమ్ముఖమ్మున సంధిపత్రముపై సంతకము చేయవలసివచ్చినది. ఇయ్యది తిరువడి రాజ్యము పోర్చుగీసువారియండను జేపట్టి సామ్రాజ్యాధికారమును ధిక్కరించుటవలన గలిగినఫలితము. ఇయ్యదియె యారవీటిచినతిమ్మరాజును తిరువడిరాజ్యప్రతిష్ఠాపకు డనిద్విపదబాలభాగవతము వక్కాణించుటకు ముఖ్యకారణము. తిరువడి రాజ్యము సామ్రాజ్యసైన్యములచే సంపూర్ణముగా జయింపబడక యున్న నిట్టిసంధి కొడంబడుట యెట్లుసంభవించెను ? కావునఫాదిరీలవ్రాత లన్నియు వట్టియసత్యకల్పనము లని త్రోసివేయవలసినదే. ఈహీరాసుఫాదిరియె మఱియొకవిపరీత విషయమును దెలుపుచున్నాడు. చూడుడు 1558 లో రామవర్మ తాను చెల్లింపవలసినకప్పము చెల్లింప కుండెనట ! విఠ్ఠలరాయలు వానినుండి కప్పము గైకొనుటకై యాఱువేల సైనికులతో దిరువడిరాజ్యముపై మరల దండెత్తి వచ్చె నట.