ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యాధీశ్వరులకు విజ్ఞప్తి పంపించుకొనియెను. అప్పుడు రామరాయలు దక్షిణదేశమున సామ్రాజ్యము బలపడునట్లుగా జేయు టత్యావశ్యక మయినదిగా భావించి పెనుగొండరాజ్యమును బరిపాలించుటకై నియమింపబడిన విఠలరాయలను దనపెదతండ్రి (అవుకుతిమ్మరాజు) కుమారుని సైన్యాధ్యక్షునిగాను చంద్రగిరిరాజ్యమును బాలించుటకు నియమింపబడిన వానితమ్ముని చినతిమ్మరాజు నుపసేనాధ్యక్షునిగను నియమించి కొంతసైన్యముతో దక్షిణదేశమునకు బంపెను. అవక్రపరాక్రమవంతు లగునీయిర్వురుసోదరులును విజయనగరసైన్యములతో దండయాత్ర సాగించి యాసంవత్సరము జూలయిమాసారంభమున దక్షిణమధురాపురమును జేరుకొనిరి. పాండ్యమండలాధీశ్వరు డయినవిశ్వనాథ నాయకుడు వారలకు భక్తిపూర్వకమైన స్వాగతము నొసంగి తానుగూడ గొంతసైన్యము నొసంగుటయెగాక తనకుమారు డైనకృష్ణప్పనాయకుని వారికి దోడుగా నొసంగెను.వీరికి ఇక్కేఱినాయకుడయిన సదాశివప్ప నాయకుడు గూడ దోడ్పడియెను. వీరు తొలుదొల్త దిరువడిరాజ్యముపై దండయాత్ర వెడలుటకు నిశ్చయించుకొని స్వసైన్యములతో బయలుదేఱి 'ఆఱవామొఱి' (Arawboly) యను కనమ మార్గమున దిరువడి రాజ్యములో బ్రవేశించి జయభేరి మ్రోగింప జేసిరి. ఇట్లు విజయనగరసైన్యములు తమరాజ్యముపై దండెత్తివచ్చిన వనువార్త తిరువడిరాజ్యము నందంతటవ్యాపించి యారాజ్యము