ఈ పుట ఆమోదించబడ్డది

పానుగల్లుసీమలను విజయనగరమునకొసంగుపద్ధతిని సంధికొడంబడియె నట. ఇట్లీవిధముగా యుద్ధము సమాప్తి జెందినది.

ఇట్లాపత్తునుండి తప్పించుకొని యిబ్రహీము ముస్తఫాఖానుతో దనరాజ్యమును బలపఱచుకొనుటకు సాధనముల నారయుచుండెను. తనసైన్యమంతయు దెలుగునాయకుల స్వాధీనముననుండుటయు వారలతో బ్రముఖుడైనజగదేవరావు రాజద్రోహియై పన్నినపన్నుగడకు రామరాయలుసమ్మతించుటయు, అందువలన తెలుగునాయకు లందఱుదనకుద్రోహులై ప్రవర్తించి రనితెలుసుకొని యెట్లయిన వారి నా యాధిపత్యములనుండి క్రమముగా దప్పించవలయు ననిదృడమైనసంకల్పము బూనిముస్తఫాఖానుతో గుట్రచేసి తొలుదొల్త తాము చేయవలసినకృత్యము ఇంద్రకొండదుర్గాధిపతి యగు కాశీరావును సంహరింపవలయు ననినిశ్చయించుకొనిరి. ఈసంగతి గోల్కొండదుర్గములోనిసైన్యముల కధికారిగ నున్నసూర్యారావు దెలిసికొనితక్కిననాయకులతో నాలోచించి యీక్రింది విధానము తనలో నిశ్చయించుకొనె నట.

ఇబ్రహీముకుతుబ్షా వేటకుబోయినప్పుడు దుర్గముల భద్రపఱచుకొనుటకును, సూర్యారావు సుల్తాను ధనాగారమును ముట్టడించి దుర్గములోని మహమ్మదీయుల నెల్లరనుసంహరించుటకును తీర్మానించుకొని రట. ఈతీరుమానమును రామరాయలకు దెలియజేయగా నాతడు వారిసహాయముకొఱకు గొంతసైన్యమునుబంపుదు ననివాగ్దత్తము చేసెనట.