ఈ పుట ఆమోదించబడ్డది

తనరాజ్యమును సంరక్షించుకొనుటకై హుస్సేనునిజాముషా యీషరతుల కంగీకరించెను. ఇట్లంగీకరించి జహంగీరుఖానుని వానిగూడారములోనే సంహరించుటకై హంతకులను నియమించి యాకార్యమును ముగించెనట. ఒకపాషండుని మాట విశ్వసించి తనకు మిక్కిలి విశ్వాసపాత్రుడైన భక్తుని సంహరించి హుస్సేనునిజాముషా రాజులనెన్నడువిశ్వసింపరా దన్న లోకసామెతను సార్థకపఱచినా డనిఫెరిస్తా నిందించినాడు. తరువాత హుస్సేనునిజాముషా రాయలను సందర్శించి మూడవనిబంధనను నెఱవేర్చెను.

కాని యతడు దురహంకారముతో హిందూరాజగు రామరాయల హస్తస్పర్శవలన దనహస్తమునకు గలిగినమాలిన్యమును బోగొట్టుకొనుటకై వెంటనే నీళ్లు తెప్పించుకొని చేతులు కడుగుకొనె నట.

రామరాయలును హుస్సేనునిజాముషా నాకతిథియైనందున సహించితినిగాని లేనియెడల నాతనిచేతులను నఱికి వానిమెడకు వ్రేలాడగట్టియుందు ననితనబాషలో పలికి తానుగూడ నుదకములను దెప్పించుకొని చేతులను కడుగుకొనెనట. ఇదియెట్టిదైనను వారిరువురకు బద్ధవైషమ్యము గలదని చదువరులకు దేటపఱచక పోదు. హుస్సేనునిజాముషా పక్షమున ఖాశింబేగు, మౌలానాఇనాయతుల్లాయును, విజయనగరము పక్షమున తిరుమలవేంకటాద్రులు నుండి సంధిపత్రమును వ్రాసి చేవ్రాళ్లు చేసి ముగించిరి.