ఈ పుట ఆమోదించబడ్డది

తోడను ముప్పదివేలు పదాతిసైన్యములతోడను గోల్కొండపై దండెత్తి వచ్చుచున్నా రన్నవిషయము ఇబ్రహీముకుతుబ్షాకు దెలియవచ్చెను. అతడు భయకంపితచిత్తుడై కాలమనుకూలముగ లేదనిచింతించి హుస్సేనునిజాముషాతో జక్కగా నాలోచించి కల్యాణిదుర్గమును ముట్టడించుట మానుకొని స్వరాజధానులకు జేరుకొనుట క్షేమదాయక మని నిశ్చయించుకొనిరి. అయినను హుస్సేనునిజాముషా రామరాయలతో సంధి గావించుకొనుటకై ఖాసింబేగును, మౌలానాఇనాయతుల్లానం రామరాయలకడకు బంపెను.

అప్పుడు రామరాయ లీక్రిందినిబంధనలకు నిష్టపడినయెడల సంధి కుదురు ననివక్కాణించెనట.

(1) కళ్యాణిదుర్గమును విజాపురసుల్తానుకు విడిచిపెట్టి యందునిమిత్తము మరల వివాదము సలుపకుండుట.

(2) దురియాఇమ్మదుముల్కు సైన్యముల కధిపతిగానున్న జహంగీరుఖానును సంహరించుట.

(3)హుస్సేనునిజాముషా రామరాయలయాధిక్యత నంగీకరించి నట్లుగాగ్రహించుటకుగా నతడు రామరాయలను సందర్శించుటకును, అతడు తనహస్తములతో నొసంగిన తమలపాకులను వక్కలను (తాంబూలమును) హుస్సేనునిజాముషా స్వహస్తములతో గైకొనుట.