ఈ పుట ఆమోదించబడ్డది

ఈయుద్ధమున సదాశివనాయకుడు సంపూర్ణ విజయమును గాంచెను. విజాపురసుల్తాను పలాయను డయ్యె నట. ఇట్లు మొదటియుద్ధమున విజయమును గాంచిన సదాశివ నాయకుడుత్సాహ సంభరితుడై కళ్యాణిదుర్గమును ముట్టడింప బోవుచుండ మార్గమధ్యమున నళియరామరాయలువచ్చి వానినిగలిసికొనెనట. అటుపిమ్మట విజయనగర సైన్యములును, అహమ్మదునగర సైన్యములును కళ్యాణిదుర్గమును ముట్టడింపగా విజాపురసుల్తాను చెదరిపోయిన సేనలను మరల సమకూర్చుకొని మఱికొంతమూలసైన్యముతో దరలివచ్చి కళ్యాణిదుర్గమును ముట్టడించిన శత్రుసైన్యములకును, శత్రుస్కంధా వారమునకు నడుమ బ్రవేశించి శత్రుసైన్యములకు భోజనపదార్థములుగాని యాయుధసామగ్రిగాని లభింపకుండునటుల ప్రయత్నించెను. ఈకార్యమును నిర్వహించుటకై ప్రశస్తమైన విజాపురాశ్విక సైన్యమును నియోగించె నట. ఆహారపదార్థము లేవియు జేరకుండ మార్గము నరికట్టుటవలన శత్రువులసైన్యములకు దుర్భరమైన దుస్థితి సంభవించెను. అప్పుడు సుల్తాను పక్షమునను విజయనగరపక్షమునను ప్రతినిధిప్రముఖులు కొందఱు సమావేశమై ముట్టడి వీడి వెడలిపోవుట యుక్తమా? సాహసించి శత్రువులతో బోరి జయముగొనుట యుక్తమా యని యోజింప మొదలుపెట్టిరి. అహమ్మదునగర సుల్తానుపక్షమున నున్న 'షాజాఫర్, ఖాశింబేగు' అనువీరులును, విజయనగరమువారిపక్షమున సైన్యాధిపతి యగుసదాశివ నాయకుడును