ఈ పుట ఆమోదించబడ్డది

"సీ. ఖలు నతిద్రోహి నల్కయతిమ్మని హరించి
             సకలకర్ణాటదేశంబునిలిపె
    నతుని వర్ధితుని దత్సుతునిఁ బట్టముఁ గట్టి
             కుతువనమల్కన క్షోణి నిలిపెఁ
    బదిలుఁడై రాచూరు ముదిగల్లు గప్పంబు
             సేయఁ గాంచ నపాదు సీమ నిలిపె
    శరణన్నమల్కనిజామున కభయంబొ
             సంగి తదీయరాజ్యంబు నిలిపె

గీ. నవని యంతయు రామరాజ్యంబు సేసెఁ
    దనగుణమ్ములు కవికల్పితములు గాఁగ
    నలవియె రచింప సత్కావ్యములను వెలయ
    భూమి నొక రాజమాత్రుఁడే రామవిభుఁడు."

అని యేమహారాజు తనవిద్యాపరిషదంబున భూషణప్రాయుఁడుగా నుండి 'రామరాజభూషణుం' డనఁ బ్రఖ్యాతి వహించి మించినమహాకవిభట్టుమూర్తిచే పొగడ్తలఁ గాంచెనో అట్టి వీరశ్రీరామరాజును 'పెరిస్తా' యను నొకచరిత్రకారుఁడొకయనామకుఁ డగుచరిత్రకారుని వాక్యములను బురస్కరించుకొని తానువ్రాసిన యొకచరిత్ర గ్రంథమునం దొకపిఱికిపందనుగాఁ బ్రవేశపెట్టినవిధము సత్యాన్వేషణపరాయణు లగుచరిత్రకారు లెల్లరును బరిశోధించి విమర్శించి సత్యమును బ్రకటించుట మఱువఁ దగదు.