పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/71

ఈ పుట ఆమోదించబడ్డది

58

అక్కన్న మాదన్నల చరిత్ర

షాకు రాయబార మంపెను. కాని 1684 లో సికందర్‌ఆడిల్‌షా గోలకొండవారిసహాయ మపేక్షించెను. సికందర్ పదునాఱేండ్ల బాలుఁడని తానాషా ఆతనిపై కనికరము వహించియుండెను. దక్షిణరాజ్యములన్నియు కలసియుండుట మంచిదని మాదన్న, పదివేలసైన్యమును సికందరుకు సాయముపంపుటకు ఒప్పుకొనెను; అట్లే శంభుజీని పంపవలసినదని కోరుచు జాబువ్రాసెను. మఱియొకజాబులో నలబదివేలనైన్యమును తాను పంపునట్లును తాము రెండువైపులను మొగలాయీలను కొట్టవలయుననియు వ్రాసియుండెను. ఈజాబు ఔరంగజేబుయొక్క వేగులవాండ్ర చేతపడినది. వెంటనే పాదుషా హైదరాబాదుమీఁదికి దండు పంపెను. కాని బిజాపురమువారికి గోలకొండవారి సాయము ఎట్లును అందిపోయినది.

పాదుషా ఉపాయాంతరములు వెదుకసాగెను. ప్రస్తుత పరిస్థితులలో గోలకొండను పీడించి ధనము పిదుకుకొనుటయే దానిని స్వాధీనము చేసికొనుటకన్న మేలని తలంచెను. హైదరాబాదులోని మొగలాయీ స్థానాధిపతి గోలకొండ సుల్తాను మీఁదను జనులమీఁదను అధికారము చలాయించుచు, వారిని తిరస్కరించుచుండినను వారు సాయుధులై తిరుగఁబడునంత వఱకు రానీయక వ్యవహరించుచుండెను. ఇందులకై ఔరంగజేబు కావలయుననియే మీర్జామహమ్మద్ అను నొకదయారహితుని, నిష్ఠురాలాపుని, అతికర్కశుని పంపియుండెను. అతనికి పాదుషా పెట్టినపని నిరంతరము కఠినముగా మాటలాడుచు