పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

6

అక్కన్న మాదన్నల చరిత్ర

ప్రతిధ్వనించుచుండును. సింహద్వారము దాఁటగానే కొండ యడివారముమొదట మఱియొక దర్వాజా కలదు. దానికి ముందు పెద్దమంటపము; అందు కిటికీలులేవు గాని లోన వెలుతురు కలదు. అటనుండి మెట్లెక్కి పోవలయును. ఆకొండ యంతయు దుర్గాకృతిని రహస్యగృహముల చేతను వానికి వలసిన నీటి సదుపాయముల చేతను అమర్పఁబడి నేటికిని చూపరుల కాశ్చర్యము కలిగించుచున్నది. ఏచోటినుండి ఏచోటికి పోవుటకు ఎచ్చటెచ్చట రహస్యమార్గము కలదో కొలఁది రక్షకులకు మాత్రమే తెలియును. నాలుగైదు అంతస్థులు దాఁటిన యనంతరము తానీషామందిరము కొండ నెత్తముననున్నది. అచ్చట స్థలము కొంతవిశాలము. ఆమందిరమున నడుమ పెద్ద కొలువు మంటపమును, దాని కిరువైపుల రెండు గదులు, దీని కెక్కుటకు ముందుభాగమున రెండువైపుల ఎదురెదురుగా పదిమెట్లు మంటపమధ్యభాగమున కలసి సింహాసనమున కెదురుగానుండును. దీనికిపైన మరియొక మంటపము, దానికిపైన ఇరుకుమెట్లచే పోదగినది బోడిమేడ. అచ్చట మెట్లకుపైన నొక యెత్తునివేశమును దానిపై సుల్తాను కూర్చుండుటకుస్థలమును ఏర్పరుపఁబడియున్నవి. అచ్చట సుల్తాను కూర్చుండినయెడల గోలకోండ దుర్గమంతయు నాతనికి కనఁబడుటయే గాక చుట్టువైపుల పదిమైళ్ల దూరము వఱకు కనఁబడును. ఆ దృశ్యము చూచుటకు నేఁడే ఎంతో ఆనందకరముగా నుండఁగా నాఁడు సజీవమై యుండినప్పడు చూచినవారిదే భాగ్యము.