పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

2

అక్కన్న మాదన్నల చరిత్ర

ర్లను ఉద్యోగులను అందఱను అడిగెను. ఎవరును చదువలేక పోయిరి. కాని అది వట్టి కాగితగమని ఎవరును సాహసించి చెప్పలేకపోయిరి. దర్బారులో నెవరును చదువలేక పోఁగా సుల్తాను ఊరిలో నెవరైన చదువఁగలరా విచారింపుమని కొత్వాలును నియమించెను. ఎవరును కనఁబడలేదు. తుదకు ఇంటింటి కడను డప్పువాయించుచు చౌబుదారులనఁబడు బంట్రౌతులు గోలకొండలోని పండ్రెండు పెద్దవీథులలో తుడుము కొట్టసాగిరి. మూఁడు నెలలుగా తాసా వాయించుచుండినను ఎవరును ముందునకు రాలేదు. వాడుక ప్రకారము వారు ప్రతిదినమును వాయించుచునే యుండిరి. అదియే నాటి దండోరా.

దండోరా ఒక గొప్ప భవనము కడకువచ్చి నిలిచినది. ఆయింటి యజమాని సయ్యదుముజఫరు అను నేనాపతి. దండోరా వినఁగానే ఆయింటినుండి యొకఁడు ఆ చౌబుదారుల నాయకుని లోపలికి పిలిచెను. నాయకుని జమాదారని అందురు. జమాదారు లోన వరాండాలో ప్రవేశింపఁగానే అచ్చటి తిన్నెల మీఁద కూర్చుండి లెక్కలు వ్రాయుచుండిన ఇరువురు బ్రాహ్మణ యువకులు నౌకరుమూలముగా నాకాగితమును అందుకొనిరి. ఒకరుమార్చి ఒకరు దానిని చూచి తమలో తామేదోచెప్పుకొని వెంటనే తమయజమానుని కడకు పోయిరి.

యువకులు ― సలాం దివాౝబహద్దర్‌గారికి. ఈ కాగితమును మేము చదువఁగలము