పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/123

ఈ పుట ఆమోదించబడ్డది

110

అక్కన్న మాదన్నల చరిత్ర

ఈ రెండవ దురంతవార్త పాదుషా చెవిని పడఁగానే ఆతనికోపాగ్ని ప్రజ్వరిల్లసాగెను. తత్క్షణమే పల్లకియెక్కి రణరంగమునకు వచ్చెను. మహాశూరులను యోధాగ్రేసరులను ఒక చోట చేరవలసినదని పాదుషా ఆజ్ఞాపించెను. అందఱును ఆయత్తపడుచుండిరి. పాదుషా పల్లకి వచ్చుచుండఁగా నొకఁడు కోటగోడనుండి పేల్చిన తుపాకి దెబ్బకు పల్లకి మోయువారిలో నొకనిచేయి విరిగిపోయినది. పాదుషామాత్రము చలింపక పల్లకిని పొమ్మనెను. ఫిరోజుజంగు మొదలైనవారు పాదుషాయొక్క దృఢ సంకల్పమునుచూచి తమపరాక్రమములను చూపసాగిరి.

ఇంతలో దైవాధీనముగా మరల నొక తుపాను చెలరేఁగినది. మొగలాయీలు త్రవ్వుకొనిన సొరంగములే వారికి నదులవలె అడ్డుతగిలినవి. ఫిరంగులుంచు దిబ్బలన్నియు కరఁగి పోయినవి. ప్రవాహము క్షణక్షణమునకు ఎదురెక్కుచుండెను. మరల గోలకొండ ఫౌజులవారు కోట వెలువడి మోర్జాల వారిమీఁదికి వచ్చిపడిరి. మొగలాయీల చిన్న ఫిరంగుల నన్నిటిని లాగుకొని పోయిరి. బరువైన వానిని మేకులు కొట్టి నిరుపయోగము చేసిరి. అగడితలో మొగలాయీలు వేసిన మట్టి మూటలనుతీసి కోటగోడలో పడిపోయిన చోటులలో పెట్టించిరి. ఇంతలో నొకఁడు పాదుషాగారి పల్లకిముందు నడచుచుండిన గొప్ప యేనుఁగును, నలువదివేల రూపాయల వెలగలదానిని, ఫిరంగితో కొట్టి చంపెను. ఎందుచేతనో వారెవ్వరును పాదుషామీఁదికి ఫిరంగులను కాల్పలేదు. అది