ఈ పుట ఆమోదించబడ్డది

నెల్లరును మూగ నారభించిరి. ఏరికిని నామెపై బ్రీతియె. ఇట్టి యుపన్యాసములు వారి కెండకాలపు వానలుగాన ననేకుల కిది పండుగ బోలియుండెను. అందున నాంసీ స్మరణార్థము గాన మహోత్కృష్ట మయ్యెను. పదిమైళ్లనక పదునైదు మైళ్లనక, శైశవ మనక ముదుసలితనమనక కొందఱు శకటముల మీద గొందఱశ్వముల పైని గొందఱు నడచుచు గొందఱు పఱచుచు పలువిధముల జనులు పలువిధ యానములతో గుంపులుగుంపు లేతెంచిరి. ఆప్రాంతముల కుటుంబములన్నియు నట నుండెను.

పార్సనెల్కిన్సు మన:పూర్వకముగ బనిసేయువాడు. అక్కార్య గౌరవం బాతని కౌత్సుక్యం బొసంగె. లింకనులు దక్క నతని యుపన్యాసము లదివఱ కెవ్వరును వినియుండరైరి. అతని వాక్సుధారసంబు గ్రోలి యందఱు నానందం బొందిరి. నాంసీ గుణసంపద నతడు వర్ణించుటలో న్యాయ వ్యతిరేకము లేదని యామోదించుటేగాని "యెంత వర్ణించినను నామె గుణసంపదకు నావర్ణన చాల" దనిరి.

ఆ యుపన్యాసమున నాబ్రహాము మగ్ను డయ్యెను. తల్లి ప్రేమయు గనికరంబును మరల నతని నావరించినట్లుండెను. రెండవమా రాపె యుత్తరక్రియల బరికించులాగు గనుపించెను. ఆమెసమాధి తనకు గొంతదవ్వున నుండెను;