ఈ పుట ఆమోదించబడ్డది

హిందూదేశములోని నూఱాఱుదేశభాషలలో బ్రతిభాషను నభివృద్ధిచేయు శ్రమకంటె నిదివఱకే యభివృద్ధిజెందియున్న యింగ్లీభాషనుగాని, హిందూదేశమున కంతటికిని సామాన్యమైన సంస్కృతభాషనుగాని జనులకు విద్యాదానము చేయగూడదా యని కొందఱు వాదించుచున్నారు. కాని దేవభాష యగు సంస్కృతంబును, రాజభాష యగు నింగ్లీషును మన దేశములో నెంత విస్తారముగా వ్యాపించినను, అవి యెన్నటికిని దేశభాషలు కానేరవు. పండితుల మనిపించుకొన గోరువారు కొందఱుమాత్రము సంస్కృతము నభ్యసింతురు; రాజకీయోద్యోగముల కాశపడువారు మఱి కొందఱుమాత్ర మింగ్లీషు నేర్చెదరు. సర్వజనుల కీభాషలు సాధ్యములు కావు. కాని జనసామాన్యమును, ముఖ్యముగ స్త్రీలును, విజ్ఞానము గల వారయినం గాని దేశము నాగరికదేశముగా నెంచబడుటకు వీలులేదు. ఉన్నతస్థితియం దుండు కొందఱు జనులుమాత్రము సాక్షరు లయి యితర జను లందఱు నిరక్షరు లయి యున్నదేశము పైన రంగుబూయబడి లోపల బేడతో నిండియుండు కొండపల్లి బొమ్మవంటిది. అట్టిదేశ మున్నతస్థితి కెన్నడును రాజాలదు. అందుల జనుల నందఱిని విద్యావంతుల జేయుటయే యిందుకు మందు. పైన జెప్పబడిన కారణములవలన నింగ్లీషు సంస్కృతాదిపరభాషలలో సర్వజనులను విద్వాంసుల జేయుట మిక్కిలి కష్టసాధ్యము. అసంబవ మనియు చెప్పవచ్చును. కాబట్టి సర్వజనులకు జ్ఞానాభివృద్ధి కలుగవలెనన్నచో వారివారిదేశభాషలమూలముననే గలుగవలెను.

ఇదియు గాక యింగ్లీషు సంస్కృతము చదువుకొన నిచ్ఛయు సామర్థ్యంబును గలవారికిగూడ నేదియేని విషయము పరభాషలో నేర్చికొనుట కంటె స్వభాషలో నేర్చికొనుట సులభముగదా? జనులకు మొదట నొక క్రొత్తభాష నభ్యసించుటకే యెంతో కాలము పట్టును. పిదప గదా యా భాషలో నితరవిషయముల నేర్చుట. ఉదాహరణార్థము, సంస్కృతంబున గణితము నభ్యసింపవలెనన్న, మొదట సంస్కృతమును బాగుగా నభ్యసించి,