ఈ పుట ఆమోదించబడ్డది

మఱొం డున్నదే? ధైర్యవంతులగు నా 'కుఱ్ఱల' కిది యెంత సౌఖ్యం బిచ్చుచున్నదో చూడుడి"యని యుప్పొంగి పలికెను.

'తిరుగుబాటు' సేనయందలి యుద్ధభటులు చే జిక్కినపుడు వారి కాహారాదులు లేకుండ జేసిచంపుట కత డెప్పటికిని నియ్యకొనకుండుటయేగాక వారిని గష్టములపాలు సేయుటకుగూడ నంగీకరింపకుండును. ప్రతికృతి యొనరింపవలసివచ్చినను మఱియేవిధముననైన నొనరింపవలసినదేగాని యుద్ధభటుల నిడుమలు గుడిపించుటమాత్రము దగదు. లింకను దిరుగ బడిన సైనికులయెడ గూడ నితరులయెడంబోలె దన దయామయత్వము జూపుచుండును.

ఒకతఱి ననేకులు గాయపడిన 'తిరుగు బాటు' సైనికులుంచబడిన గృహమునకు లింకను వెడలెను. వా రందఱి గలయజూచి యతడు,

"మీరాటంకము వలుకకున్న మీ కెల్లర కేను హస్త బొసగగోరుచున్నాను. మన దేశమునకై నడపి తీరవలసిన ధర్మముంబట్టి యీ యుద్ధము జరపవలసియున్నది. మీ శక్తికి మీరినకారణములచే మీలో ననేకులు నాకు వైరులుగ గన్పట్టుచున్నా రనుట నిజమ. అయిన మీపై నాకెట్టి క్రోధమును లేదు. మీ మేల కోరుచు స్నేహభావమున హస్తం బొసగెద" ననియెను.