ఈ పుట ఆమోదించబడ్డది

లను వృద్ధిచేయవలసినభార మింగ్లీంషుభాష నభ్యసించిన ప్రతివారు తమ మీద బడిన యీకార్యభారమును వహించి దేశభాషాభివృద్ధికి తోడుపడినిపక్షమున దేశముయొక్క హీనదశకు వా రుత్తరవాదులుగా నుందురు. కాబట్టి యికనైన సర్వకాలాశాలలయందు బట్టపరీక్షల నిచ్చి మెప్పొందినవారు తాము లౌక్యాధికారములయందు బ్రవేశించి భార్యాపుత్రాదుల కాభరణములు చేయించిపెట్టుటతోడనే కృతార్థుల మయితి మను కోఖ దేశభాషావధూటికి గూడ సద్గ్రంథాభరణములను వృద్ధిపఱుప బ్రయత్నింతురని నమ్ముచున్నాము." ఇంగ్లీషు విద్యావిభూషితు లందఱు నీవాక్వంబుల మఱవకుందురు గాక. రమేశచంద్రదత్తు వంటి యింగ్లీషుగ్రంథముల వ్రాసి కీర్తి గన్నవాడుగూడ దనమాతృభాషయగు బెంగాలీలో గ్రంథములు వ్రాయుట తనకు బరమకర్తవ్యముగ నెంచుచున్నాడు. ఇంగ్లీషున బండి మని విఱ్ఱవీగి తెనుగును దిరస్కరించెడు మనవారి నేమనవలె?

ఏశాస్త్ర మెవ్వ రభ్యసించిరో యాశాస్త్రము వారిచేతనేవ్రాయించ నిశ్చయించితిమి గాన నెవ్వరి యభిమానశాస్త్రంబున వారు పొత్తంబులు వ్రాసి మాగ్రంథమాలలో గూర్చుదు రని కోరుచున్నాము.

ప్రకృతిశాస్త్రములు వ్రాయునపుడు ఆయాశాస్త్రంబులలోని పారిభాషికపదములు (Nomenclature) దేశభాషలలో లేనందున గ్రంథకర్తలు త్రొక్కులాడవలసి వచ్చుచున్నది. ఇందుకు గాశీలోని 'నాగరీప్రచారిణీ సభ' వారు విద్వాంసులయొక్క సంఘము నేర్పఱచి భౌతికశాస్త్రము (Physical Sciences) లలోని పారిభాషికపదముల నిర్ణయించి యున్నారు. ఈ పరిభాష సంస్కృతపదభూయిష్ట మయినందున నీపరిభాషనే గ్రహించుటకు మేము నిశ్చయించినాము. ఇట్లు నిశ్చితమైన పరిభాషను వాడక, యెవరికి వారే క్రొత్తపరిభాష కల్పించుకొనుచు గ్రంథములు వ్రాసినచో నవి యెవ్వరికి దెలియక 'మూగ చెవిటివారి ముచ్చటరయ' యగు ననుటకు సందేహము లేదు. కాన మొదట నెంత పిచ్చిగ గానవచ్చినను ఒక