ఈ పుట ఆమోదించబడ్డది

నెను. ఆకాలమున నాదేశమున వ్రాయ గలుగువారే యరుదు. గాన వెదకుచువచ్చి యుద్యోగము లిచ్చుచుందురు. నాడు గార్యము దీర్చుటయందు లింకను మిక్కిలి సమర్ధత సూపెననుట కతని సహోద్యోగి యగు గ్రేహమను నుపాధ్యాయుడే "లింకను పనులెల్ల మిక్కిలి సౌలభ్యముతో న్యాయానుసరణముగ బక్షపాతరాహిత్యముతో సల్పెను. రాజకీయోద్యోగముల నతని కిదియె మొదటిది. నాటి పత్రము లిప్పటికిని స్ఫ్రింగుఫీల్డునం దున్నవి. చూడ గోరువారెల్లరును జూడ నగు" నని సాక్ష్యమిచ్చుచున్నాడు.

న్యూసేలము జనులు లింకనును రట్లడ్జి యానకట్టమీద జిక్కినపడవను జక్కచేసిన బుద్ధిశాలి వీడె యని గుర్తించి యుండిరి. నెల్స నాపట్టణమును విడువదలచి యప్పుడు సంపూర్ణముగ నొడ్డు లొరసికొని ప్రవహించుచుండిన నదిపై దమ్ము రక్షించుకొనిపోవువా డెవ్వడని యరయుచుండ నంద ఱాబ్రహామును జూపిరి. ఆ సూచనానుసరణముగ లింకను గర్ణధారుడుగ జేకొనబడియెను. ఓడను సురక్షితముగ నడపి రేవు జేర్చి తన వేతనమును గొని యతడు న్యూసేలమునకు వచ్చిచేరెను.

ఆపుట్టు సరకులు దిగినతోడనె యా గ్రామస్తు లీ నవీనాగతుని యుద్యోగము నెఱింగికొనిరి. లింక నొక్కొకవస్తువుం దీసి కొట్టున నుచితస్థలమున నుంచ నారంభించెను.