ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము

న్యూ ఆర్లియన్సుకు రెండవ యాత్ర.

1831 వ సంవత్సర ప్రారంభమున ఫిబ్రేవరిలో నొకనాడు డెంటను ఆఫుట్టను వ్యాపారి యొక్కడు దనసరకుల న్యూ ఆర్లియన్సుకు గొనిపోవ 'నావికుడు' గావలెనని వెతకుచు జాన్‌ను గాంచి నీవు నాకార్యము నెఱవేఱ్పవలె ననియెను. అత డందులకు వెనుదీసి యాబ్రహామైన నాపనికి జాలునని పలికి వర్తకుని నొడంబఱచి వేతనముల నిష్కర్ష చేసికొని లింకను మాఱుదమ్ము డగు జాన్‌స్టనునుగూడ జేర్చుకొనున ట్లేర్పఱచి వారిద్దఱితో గలసి మాట్లాడ వెడలెను.

ఆపుట్టాప్రదేశమున నెల్ల నుదారబుద్ధి గలవా డని ప్రసిద్ధి జెంది యుండెను. ఆతని యీగి కొన్నిసమయముల నతనికే హానికరముగ నుండునంత యెక్కు డనియు వదంతి గలదు. ఇది యెట్లుండినను ఆబ్రహాము జాన్‌స్టనుల కతడియ్య నంగీకరించిన వేతనపు మొత్తముమాత్రము మిక్కిలి యౌదార్యమును సూచించుచుండెను. అంతటి కూలి వారదివఱకు గడించినది లేదు. కావున నాబ్రహాము జాన్‌స్టను లిందున కానందంబున నొప్పుకొనిరి.