ఈ పుట ఆమోదించబడ్డది

వెంబడించిరి. వారును నెందఱు 'నావికులు' దము నెదిర్చిరో గదా యని భయపడి తిరిగిచూడక పరుగెత్తిపోయిరి.

ఈ నీగ్రోలు బానిసలు. తమ యజమానుని యుత్తరువు ననుసరించి నాదారి బోవు పడవల గొల్లగొట్ట నేతెంచిరి. ఆహా! బానిసవృత్తి యెంతహీన మైనదో చూడుడి. తమ దేహముల దొర కర్పించుటయేగాక మనముల గూడ నర్పించ వలసి వచ్చుచుండెను. దొంగతనముచేసి ధనము గొనిరమ్మనిన నట్టిదుష్టకార్యము మే మెట్టుల సల్పుదు మనుటకు వారికి స్వాతంత్ర్యము లేకుండెను. ఇట్టిదుర్దశయం దుండువారల నీ తరుణమున నెదిర్చి పోరి యోడించి, వారిదెబ్బలచే నెన్నియో గాయములు తగుల గంటి పైమచ్చ దాని కానవాలుగ బ్రాణాంతమువఱకు నిడికొనిన యాబ్రహాము దేశాధ్యక్షత వహించి యీదిక్కుమాలిన వారికై పెనగి వారిదుర్దశ మాన్చి వారికై ప్రాణము లర్పించు టెంతటిదైవికాజ్ఞయో గమనింపుడి.

తమ వైరుల బాఱదోలి యాబ్రహా మాలెనులు దమ పడవను మఱియొక స్థలమునకు గొంపోయి నా డచట రాత్రి గడపి తరువాత బ్రయాణముసేసి న్యూఆర్లియన్సు చేరిరి. వారి సరకంతయు దగినవెల కమ్మబడియెను. మొదట నేర్పఱచుకొనిన తెఱంగున వారిరువురును దమ యిండ్ల కొక పొగయోడపై వచ్చిచేరిరి.