పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/78

ఈ పుట ఆమోదించబడ్డది

64

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ద్విపదకావ్యముగా రచియింపఁబడినది. దీనిలో సామాన్య జనంబులకుఁ గూడ సులభముగా తెలియునటుల వేదాంతము వివరింపఁబడినది. వేంకటాచల మాహాత్మ్యమునందు విష్ణుమూర్తి పద్మావతిని వివాహమాడినకథ మిగుల చిత్రముగాఁ జెప్పఁబడియున్నది. కడమగ్రంధములేవియు ముద్రింపఁబడనందున వానిని గుఱించి యేమియు వ్రాయుటకు వీలులేదు. "ఈమె కవిత్వమునం దల్పదోషము లక్కడక్కడఁ గానవచ్చుచున్నను మొత్తముమీఁద కవన మతికఠినముగాక మృదుమధురరచనను గలదియయి యున్నద"ని కవిచరిత్రమునందు రాయబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులవారీమె కవిత్వమును బొగడిరి. ఇట్టివారిచేఁ బొగడొందఁ దగినవిద్యయుఁ గవిత్వశక్తియుఁ గలిగినను నీమె యిసుమంతయు గర్వములేక మిగుల వినయవతిగా నుండెనని రాజయోగసారములోని యీక్రింది ద్విపదలు వెల్లడించుచున్నవి.

                ద్వి. వినరయ్య కవులార విద్వాంసులార
                      వినరయ్య మీరెల్ల విమలాత్ములార
                      ఘనయతిప్రాస సంగతులు నేనెఱుఁగ
                      వరుస నాక్షేపింప వలదు సత్కృపను.

ఈమె రచియించిన గ్రంథములు తఱిగొండ నృసింహస్వామి కంకితములు చేయఁబడినవి. ఈమె శృంగారరసాధిదేవత యగుకృష్ణుని భక్తురాలయినను ఆమెకుఁ దనగ్రంథములయం దెక్కడను శృంగారవాక్యములను జొప్పింప నిష్టములేకయుండెను. అందువలన నామెకృష్ణుని నిట్లు స్తుతియించెను.