పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/176

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నతఁడధికాశ్చర్యముంబొంది స్త్రీ లిట్టిసాహసకార్యములలోనికిఁ జొరఁగూడదనియు మీజీవనమునకై శివాజీగారు చాల భూమిని మీకిచ్చెద రనియు, గాన మీరు సాహసించి మీయొక్కయు మాసైనికుల యొక్కయు ప్రాణములకుఁ దెగించకుఁ డని యతఁడు సావిత్రీబాయికి వర్తమాన మంపెను. కాని యావచనములా శూరయువతికి రుచియింపక మరల నిట్లు చెప్పిపంపెను. 'నాప్రాణముల కాధారమగు ప్రాణనాధుఁ డిదివఱకే స్వర్గమున కరిగెను. కాన నిఁక నేను నాప్రాణముల కెంతమాత్రమును భయపడను. నాపుట్టినింటివారును, చొచ్చినయింటివారును ప్రాణముల కన్న స్వకర్తవ్యమునే యధికముగా నెంచెడివారుగా నుండిరి. నాభర్త నెఱవేర్పఁదలఁచినకార్యము నతఁడు నెఱవేర్పకయే పరలోకమున కేగెను. కాననది నెఱవేర్చుట నాకర్తవ్యము. ఇందువలన మీరు వెంటనే కోటను నాస్వాధీనము చేసిపొండు. లేదా యుద్ధమునకు సిద్ధమగుఁడు. ఈరెండు వాక్యములు దప్ప మూడవవాక్యము నేనెన్నటికి నొప్పను.'

ఈమె చెప్పినమాటలు దాదోజీకి నసమ్మతములైనను విధిలేక యతఁడు సంగ్రామరంగమునకు రావలసినవాఁడాయెను. అప్పుడు సావిత్రీబాయి నాలుగైదువందలసైనికులతో వేలకొలఁది సైనికులు గలదాదోజీసైన్యములను దైన్యంబు నొందించి వారివ్యూహములను చిందరవందఱగఁ జేసి యనేకులను దనకత్తివాతంబడవేసి కొందఱిని మూర్ఛనొందించి, కొందఱిని గాయపఱచి యీనిన యాఁడుసింగమువలె నా రణరంగమున నెటు చూచినను దానెయై యందఱకును భయము పుట్టింపుచుండెను.