పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/210

ఈ పుట ఆమోదించబడ్డది

సాగిరి. లక్ష్మీబాయి యివన్నియు రాజ్యనాశన హేతువులనియు, ఈ యాడంబరమును వదలి సైన్యపు బందోబస్తు చక్కగా జేసి యుద్ధసన్నద్ధులమయి యుండవలసిన దనియు జెప్పెను. కాని యవి స్త్రీ వాక్యములని పేష్వాగారును, ఆయన సేనాయకుడగు తాత్యాటోపేగారును మన్నింపక మహోత్సవములలోను, బ్రాహ్మణ సంతర్పణములలోను మునిగియుండిరి.

జూన్ నెల 16 వ తేదీని సర్ హ్యూరోజ్‌గారు సైన్యసహితులయి బహద్దరు పురము చేరిరి. కాని భోగపరాయణలగు పేష్వాగారి కాసంగతియే తెలియకుండెను. ఆంగ్లేయ సేనానయకు లచటినుండి మురారికోట చేకొనిరని వినియును పేష్వాగారు చింతదక్కి పుణ్యకృత్యములు చేయుచునేయుండిరి. ఆయన యనుజ్ఞవడసి తాత్యాటోపే సైన్య వ్యవస్థ చేయురీతిగానక లక్ష్మీబాయిగారిని వేడుకొనిరి. జయము కలుగు నాసలేదని తెలిసికొనియు రాణిగారు సమరమున దెగి స్వర్గము గాంచ నపేక్షించి యాయన మనవి చిత్తగించెను. తదనంతర మామె కొంతసైన్యమును చక్కబరచి మిగత నితర సేనానాయకులను జూడ నియమించెను. ఆమె తనసేన ననేక భాగములు విభజించి మిగుల భద్రముగా యుద్ధసన్నద్ధురాలై నిలిచెను. ఇతర సైన్యాధిపతులును తమతమ శక్త్యనుసారముగా వ్యూహములు వన్ని నిలచిరి. రాణిగారు గ్వాలేరు పూర్వదిక్కు సంరక్షింతునని తన సైన్యము నచటనే మోహరించి నిలిచిరి.