పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/179

ఈ పుట ఆమోదించబడ్డది

తా మారంభించిన పనికి నడుమ నంతరాయము సంభవించిన తోడనే యా పనిని విసర్జించువారు, ఉత్తములు ప్రారంభించిన దాని కెన్ని యడ్డములు వచ్చినను, వానినెల్ల బూనికతో నిదానించి విజయము గాంచువారు.

కష్టము లెంత యుత్కృష్టములుగా నుండునో మనకు ధైర్య, స్థైర్యము లంత యధికముగా నుండును. కాబట్టి మన మారంభించినదాని నెన్నడును మానజనదు. ఇక నా విన్నపము ముగిసినది. ఇంతసేపు ప్రసంగించుటవలన మిమ్ము విసిగించితి నేమోయని భయపడుచున్నదానను. అందులకు నన్ను మీరు క్షమింతురుగావుత."

ఈ ఉపన్యాస మిచ్చినపిదప ఆనందీబాయి యొక క్రైస్తవగురువుల కుటుంబముతో అమెరికా కరుగ నిశ్చయించెను. ఒకానొక హిందూ బ్రాహ్మణస్త్రీ అమెరికా కరుగునని విని రావ్‌సాహెబుదాంగేకర్ అను నాతనికి మిగుల విచారము కలిగెను. అంత నాతడనేక ప్రయత్నములచే నామె యమెరికాప్రయాణ మాపవలెనని యత్నించి చూచెను. కాని యాతని ప్రయత్నమువలన నేమియు ఫలము కానరాకుండెను. అంత నా పూర్వాచారపరాయణుడు ఆనందీబాయి యాప్తులకు వ్రాసి వారిచే నమెరికాకు బోవలదని యానందీబాయికి ననేకములయిన యుత్తరములను వ్రాయించెను. కాని వానివలనను ఆమె ప్రయాణమాగదయ్యెను! రేపు ప్రయాణమనగా ఆనందీబాయి యక్కవద్దనుండి తమ్మునికి ప్రాణాంతముగా నున్నదనియు, నీవు తక్షణము బయలుదేరి రావలసిన