పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/136

ఈ పుట ఆమోదించబడ్డది

ఎంతచెప్పినను పన్నా వినదని తెలిసికొని తా నాలస్యము చేసిన రాజపుత్రుని ప్రాణము దక్కదని యెరిగిన వాడగుటచే వాడా తట్టను నెత్తిన నిడికొని రాజనగరు వెలుపలి కరిగెను. పన్నాదాయియు రాజపుత్రుని యలంకారములను తన పుత్రునకు నలంకరించి, వానిని రాజబాలుని పాన్పుపై నిదురబుచ్చెను. ఇటులా రాజభక్తిగల యువతి తన పుత్రుడు నిదురింపుచుండ తానా పక్క సమీపమునందుండి బనబీరుని రాకకై నిరీక్షింపుచుండెను. ఇంతలో నా కాలస్వరూపుడచటికి వచ్చి మిగుల దయగలవానివలె రాజపుత్రుని దేహము స్వస్థముగా నున్నదాయని పన్నానడిగి, వానిని జూచెదనని పక్క యొద్ది కరిగెను. ఆ ప్రకారమచటి కరిగి, వాడు నిదురింపు చున్నవా రెవ్వరని విచారింపక నా యర్భకుని పొట్టలో కత్తి పొడిచి పారి పోయెను. వాడట్లు పొడవగా నా బాలుడొక కేక వేసి ప్రాణములు విడిచెను. ఆ కేక రాజభవనమునం దంతటను వినబడి జనుల నందరిని లేపెను.

ఆ కేక విన్నతోడనే రాజభవనమునందలి వారంద రచటికి వచ్చిరి. వారు వచ్చి చూచునప్పటికి రాజపుత్రుని దేహ మంతయు రక్తమయమయి, యా బాలుడు ప్రాణములనువిడచి యుండెను. పన్నా దాయి యాబాలుని సమీపముననే దేహము తెలియక పడియుండెను. చచ్చినవాడు రాజపుత్రుడేయనితోచుటచే జనులందరు మిగుల దుఖించిరి. పన్నా సేదదేరినపిదప రాజపుత్రుని జంపినవా రెవ్వరని యడుగగా "నొక నల్లటి పురుషుడెవడో చంపెన"ని చెప్పెను. రాజపుత్రుని జంపిన