పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/106

ఈ పుట ఆమోదించబడ్డది

దిత్యుడు విద్వాంసులను మన్నించునని విని మిహిరుడు రాజు సందర్శనము జేసి తన విద్యావిశేషమును గొంత కనుపరపగా రాజు సంతోషించి యాయనను దన యాస్థానపండితునిగా నేర్పరచి తన గ్రామమునకు దోడుకొనిపోయి వరాహుని బిలిపించి యీదంపతుల నతనికి జూపి 'వీరిని నీ యింటను నుంచుమని' చెప్పెను. అందుపై వరాహుడు వారిని దనయింట నుంచుకొనెను. అంత గొంతకాలమునకు వరాహునకు దాను పారవేసిన తన కొమారుడీ మిహిరుడే యని తెలిసి పితాపుత్రు లిరువురకును అపరిమితానందము కలిగెను. తదనంతర మెప్పుడును వరాహుడు, మిహిరుడు, ఖనా తమలో దాము జోతిషమును గురించి అనేక ప్రసంగములు చేయుచు జ్యోతిశ్శాస్త్రములోని క్రొత్తక్రొత్త సంగతులను గనిపెట్టసాగిరి. మిహిరుడు తండ్రితో సమాన విద్యావిశేషములు గలవాడుగాన, విక్రమార్కుని సభయందును, దేశమునందంతటను ఆయనకీర్తిని గొనియాడనివారు లేక యుండిరి. ఖనా యింటియొద్దనే యుండి రాజసభ కెన్నడును పోకపోయినను, ఆమె యందుండు సుగుణ సంపదయు, విద్యాపరిమళమును దిగంతములయం దంతటను వ్యాపించెను. వరాహుని కోడలును, మిహిరుని భార్యయు నగు ఖనా ఖగోళవిద్యయం దధిక ప్రవీణురాలని యందరును జెప్పుకొను చుండిరి.

ఇట్లుండ నొకనాడు విక్రముడు వరాహుని బిలిచి ఆకాశమునందుగల నక్షత్రసంఖ్య చెప్పుమనె నట! అందున కాయన గ్రంథములను శోధించియు నక్షత్రసంఖ్య కనుగొనజాలక, ఆకా