పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

వీరసింహమునకు బంపుము." విద్యాసాగరు లామె యభిప్రాయమును గనిపెట్టి దీనరక్షణార్థమై యామెను వీరసింహమునకు బంపిరి. మరియొకసారి యామెను ఈశ్వరచంద్రులు దమయొద్దకి దోడ్కొని వచ్చుటకు యత్నించిరి. కాని పరోపకారార్ధమై యామె యా పల్లెను విడిచినదికాదు.

స్వర్ణాలంకారములయందు భగవతీదేవి కెంతమాత్రము నిష్టము లేక యుండెను. "నగలు పెట్టుకొనిన నేమి ప్రయోజనము? ఒక దినము దొంగలు తీసికొనిపోగలరు. కాని యా ధనముతోనే సహాయహీనకుటుంబములకు, దరిద్రులగు విద్యార్థులకు సహాయముచేసిన నెంతయో యానందము కలుగును!" ఇట్లు భగవతీదేవి లోకుల కుపదేశించుచుండెను. ఒకసారి విద్యాసాగరుడు తల్లితో నిట్లనియె. "అమ్మా దేవిపూజ చేయుట మేలా? లేక యాధనముతోనే పరోపకారము చేయుట మేలా?" అందు కాపరోపకారపరాయణ "అదే ధనముతో దు:ఖితుల దు:ఖము నివారణమయ్యెడి యెడల బూజచేయుట కంటె దు:ఖితుల కిచ్చుటయే మేలు" అనెను. ఆహా! భూతదయ యనిన నిట్టిదియే కదా! ఈమె వార్ధక్యకాలమునందు కాశీవాసము చేసి యచ్చటనే కాలధర్మము నొందెను.


________