ఈ పుట ఆమోదించబడ్డది

పురుషులు, జంతువులు, ప్రకృతి శక్తులు వున్నాయని చెప్పాలి. విగ్రహాలు, పటాలుగా దేవుళ్ళను గుడిలో దేవాలయంలో, మసీదులో(రాత పూర్వకంగా) దేవుళ్ళను పెట్టారు.

ఇవన్నీ ఎవరు చేశారు. మనుషులు.

కనుక దేవుడిని సృష్టించింది, కనిపెట్టింది. ఎవరు? మనుషులే.

సృష్టికర్త ఎవరు? మనిషి.

అందుకే మనుషుల తీరులో దేవుళ్ళు కనిపిస్తారు. ఇది చెప్పాలి.

పిల్లలు ప్రశ్నలు వేస్తారు. ఓపికగా చెప్పాలి. తెలియని వాటికి బుకాయింపు,అబద్ధం సమాధానం కాదు. తెలుసుకుందాం అనాలి.

అన్నిటినీ దేవుడు సృష్టించాడంటే,దేవుడిని ఎవరు పుట్టించారనే ప్రశ్న సహజమైనది. అందుకు జవాబు కన్నెర్ర చేయడంకాదు. దేవుడి పుట్టుపూర్వోత్తరాలు విడమరచి చెప్పడమే. పవిత్ర గ్రంథాలలో విడ్డూరపు కథల్ని పిల్లలకు కథలుగానే చెప్పాలి. పరమసత్యాలుగా నమ్మించరాదు.

పవిత్రగ్రంథాలలో జంతువులు మాట్లాడతాయి. అది కథ:పవిత్ర గ్రంథాలలో మగవాడి పక్కేముక నుండి ఆడదాన్ని దేవుడు పుట్టిస్తాడు. అది కథ: అలాంటి కథల్ని వినోదంగా ఆనందించాలి. పిల్లలకు అలాగే చెప్పాలి.

ప్రవక్తలు చేసిన పాపకృత్యాలు, తప్పుడుపనులు. రుషులు చేసిన వ్యభిచారం అన్నీ దేవుడి ప్రేరణగా చెప్పి తప్పుకున్నారు. జనాన్ని నమ్మించడానికి అది పెద్ద ఎత్తుగడ.

ఏదైనా రుజువుకు నిలబడాలి. లేకుంటే నిరాకరించాలి.

పిల్లలకు శాస్త్రీయంగా అలవాటు చేయాలి. ప్రవక్త,రుషి,మహాత్మ, బాబాలు చెప్పేది ప్రశ్నించవచ్చు. రుజువు చేయమనవచ్చు. పిల్లల్లో అలాంటి ధోరణి అవసరం.

ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయని భక్తులు ప్రచారం చేస్తారు. పిల్లలకు వైద్యం లేకుండా చంపుతున్న సంఘటనలున్నాయి.

ప్రార్థన చేస్తే ఎవరూ పలకరు. ఎవరికీ వినిపించదు. ప్రార్థన అంటే, అవతలివైపు ఎవరూ లేకున్నా ఫోనులో వారితో మాట్లాడినట్లు! ఇది వృధా. పిల్లలకు యిది చెప్పాలి.

ఇలా శాస్త్రీయంగా చెబితే పిల్లలు అభివృద్ధి చెందుతారు.

ఈ విషయాలను చక్కగా కార్టూనుల ద్వారా అందించాలి.

- హేతువాది, డిశంబరు 1999