ఈ పుట ఆమోదించబడ్డది

దేవస్థానం అధికారులూ, పోలీసులూ, విద్యుత్ బోర్డువారూ కలిసి కొందరు వ్యక్తులను మాత్రమే ఈ ప్రదేశానికి పంపిస్తున్నారు. ఒక వ్యక్తి సరిగా సాయంత్రం ఆరున్నరకు ఒక పాత్ర నిండా కొన్ని కిలోల కర్పూరాన్ని నింపి వెలిగిస్తాడు. రెండు చేతులతో ఆ పాత్రను పైకి ఎత్తి మూడు పర్యాయాలు శబరిమలకొండవైపు చూపి దించివేస్తారు. ఇదే ఇన్నాళ్ళు భక్తులు దైవికమైన మకరజ్యోతిగా భావించి పూజిస్తున్న వ్యవహారం.

1983లో యుక్తివాద సంఘంవారు ప్రజలను మోసగిస్తున్న ఈ తీరు పట్ల అభ్యంతరం తెలుపుతూ కొండపైకి వెళ్ళటానికి ప్రయత్నించగా పోలీసులు లాఠిచార్జి చేశారు. అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావనకు రాగా కేరళ ప్రభుత్వం కంటితుడుపుగా విచారణ సంఘాన్ని నియమించింది. అప్పటి నుండి దేవస్థానం వారు మకరజ్యోతిని గురించి దైవికమని గాని, కాదనిగానీ చెప్పకుండా మౌనం వహించారు. ఐతే మకరజ్యోతిని ఫోటోలు తీయనీయరు. రహస్యం బయట పడకుండా అట్టిపెట్టటానికి ఇదొక ఎత్తుగడగా భావిస్తున్నారు.

ఈ దేవస్థానం నిధుల దుర్వినియాగం విషయమై చాలా ఫిర్యాదులున్నవి. 1965లో 342 మంది దేవస్థానం సిబ్బంది ఉండగా, 1986 నాటికి 1234 మంది అయ్యారు. ఈ నియామకాలు కూడా అరాచకత్వంతో కూడినవని విచారణ జరిపిన రెవెన్యూబోర్డు సభ్యుడు డా॥సి.ఆర్. కృష్ణమూర్తి తెలియపరచారు. ఈ సిబ్బందిలో చాలా మందికి నెలకు రు.50, వందరూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. సేవానిబంధనలు ఏర్పరచలేదు. అవినీతి విలయతాండవం చేస్తున్నదనీ, భక్తులిచ్చిన బంగారాన్ని అమ్ముకుంటున్నారని ఫిర్యాదులున్నవి.

భక్తులు విషయాన్ని విడమరచి తెలుసుకోరు గనుక వారి మూఢనమ్మకాలే శబరిమల దేవాలయానికి ఆదాయం తెచ్చిపెడుతున్నవి.

- హేతువాది, మార్చి 1987
21వ శతాబ్దంలోకి పోబోయే ముందు మానవతావాదానికి మైనారిటీ తీరాలి.

పోలీసులు ఉన్నారు గనుక మనం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నామనటం తప్పు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే మనకూ సౌకర్యంగా ఉంటుందీ, ఇతరులకూ అనుకూలంగా ఉంటుందీ, సమాజం సాఫీగా నడుస్తుంది. మనిషి నీతిగా, రీతిగా హేతుబద్ధంగా ఉండటం మనకు, తోటివారికీ,సంఘానికి మంచిదని మానవతావాదం చెపుతుంది. మరణించిన తరువాత దేవుడు రక్షిస్తాడు గనుక, నరకంలో యమయాతనలు పడవలసి వస్తుంది గనుక అధమాధమ పునర్జన్మఎత్తవలసి వస్తుంది- తాము చెప్పిన నీతిని పాటించమని మత శాస్త్రాలూ,పురోహితవర్గాలు ఘోషించాయి.