ఈ పుట ఆమోదించబడ్డది

ఆయుధాలు ఎందుకనే మీమాంస వచ్చింది. అమెరికాలో ప్రస్తుతం వీరి సంఖ్య 3 వేలకు మించలేదు. బోడిగుండు, కాషాయి వస్త్రం, బహిరంగ ప్రదేశాలలో హరేకృష్ణ పారాయణం వలన వీరు తాత్కాలిక ఆకర్షణకు దారితీసినా, యిదీ క్షీణదశలో వున్నది.

డివైన్ లైట్ మిషన్:

హన్స్ జి మహరాజ్ 1960లో భారతదేశంలో యీ శాఖను స్థాపించారు. ఆయన చనిపోగా ఆయన 8 సంవత్సరాల కుమారుని గురువుగా మార్చారు. అతడి చుట్టూ కథలు అల్లారు. అభూత కల్పనలు ప్రచారం చేశారు. అమెరికాకు పంపారు. తొలుత బాగా ఆకర్షించిన యీ సంఘం 1973 నుండే తగ్గుముఖం పట్టింది. కొన్ని దుర్ఘటనల వలన సంఘానికి చెడ్డపేరు వచ్చింది. మహరాజ్ జి మయామిలో స్థిరపడగా, యీ శాఖ కొన్ని ఆశ్రమ కేంద్రాలకు కుంచించుకపోయింది.

జపాన్, కొరియాల నుండి వచ్చిన సంఘాలు అమెరికాలో తిష్టవేసి అధ్యాత్మిక వ్యాపారం చేస్తున్నాయి.

అమెరికాలో ఎప్పటికప్పుడు కొత్త సంఘాలు తలెత్తడం, వింత బాబాలు పుట్టుకరావడం జనాన్ని వంచించడం సర్వసామాన్యమైంది.

జిమ్ జోన్స్ అనే అతడు గయానాలోని జోన్స్ టౌన్ లో 900 మందితో సామూహిక ఆత్మహత్యలు జరిపినప్పుడు ప్రపంచం విస్తుపోయింది. తానే జీసస్ క్రీస్తును అంటూ అతడు భ్రమింపజేసి అలాంటి ఘాతుకంతో అంతమయ్యాడు.

కృష్ణచైతన్య సంఘం వారు బహిష్కరించగా బయటకు వచ్చిన కీత్ హాం అనే అతడు కీర్తానందస్వామి భక్తిపాద అని పేరు పెట్టుకొని దారుణాలకు పాల్పడ్డాడు. 1987 నుండీ అతడు చేసిన, చేయించిన హత్యలు, హింసలు, రహస్య ధనసేకరణ బయటపడగా 30 ఏళ్ళ జైలుశిక్ష విధించారు. కొత్త బృందావనం స్థాపించిన కీత్ హాం 4 వేల ఎకరాలు స్థలంలో విలాసాలు సృష్టించాడు. (వెస్ట్ వర్జీనియా మౌండ్స్ విల్లి) గుడి శిఖరానికి బంగారు తొడుగు అమర్చగా, అది యాత్రికులకు ఆకర్షణగా మారింది. పోలియోతో చిన్నతనం నుండి బాధపడుతున్న భక్తి పాదస్వామి సమాజానికి దూరంగా వుండాలని ఫెడరల్ కోర్టు ఆదేశాలిచ్చింది. మూడవ ఫ్రెడరిక్ అనే అతడు జెన్ మాస్టర్ రాము అనే పేరుతో కంప్యూటర్ కల్ట్ ను స్థాపించి లక్షలు గడించాడు. బౌద్ధాన్ని కేపిటలిజాన్ని మేలికలయిక చేశానంటాడీయన కాని, అతడివల నుండి బయటపడినవారు అతడి కామతృష్ణ, ఇతర ఘోరాన్ని బయటపెట్టారు. కేవలం కంప్యూటర్లు వాడి ఏడాదికి 10 మిలియన్ డాలర్ల వరకూ వీరు ఆర్జిస్తున్నారు. ఆ డబ్బుతో గురువు విలాసవంతంగా జీవిస్తున్నాడు. 390 మంది శిష్యులు అమెరికాలో యీ శాఖలో పనిచేస్తున్నారు. అమెరికాలో ప్రశాంత జీవనం సమకూర్చుతామనీ, యోగం ద్వారా చింతల్ని దూరం చేస్తామనీ కొందరు బయలుదేరి చిన్న సంస్థలు పెట్టి ధనార్జన చేస్తున్నారు.