ఈ పుట ఆమోదించబడ్డది

కొందరికి అద్భుతశక్తులు వస్తాయి. అవి ఎలా వచ్చాయో పరిశీలించే బదులు, ఆ వ్యక్తి చుట్టూ కథలు అల్లడం, పునర్జన్మ శక్తులు అంటగట్టడం కూడా ఉండాలి. ఐరిష్ గణిత శాస్త్రజ్ఞుడు విలియం హామిల్లన్ (1805-1865) 13 భాషలతో పండితుడు. చిన్నతనంలోనే గణితంలో విశేష ప్రజ్ఞ కనబరిచాడు. ఇలాంటి కోవలో మొజార్ట్ వంటి వారున్నారు. ఇదంతా పూర్వజన్మ సుకృతం అని నమ్మేవారున్నారు. అది శాస్త్రీయ పద్ధతి కాదు. పరిశీలించి తెలుసుకోవడమే ఉత్తమం. అయితే మనకు తెలియని వాటి పట్ల, ఏదో ఒక కట్టుకథ అల్లే బదులు, రుజువులు దొరికే వరకూ వేచివుండడం, పరిశీలన కొనసాగించడం ఉత్తమ విధానం.

REINCARNATION - A Critical Examination : Paul Edwards

Prometheus Books,USA

- మిసిమి మాసపత్రిక,మే-1998
విజ్ఞాన సమన్వయం

ఒకప్పుడు తన సామజిక సిద్ధాంతాలతో ప్రపంచాన్ని కలవరపెట్టి, ఉర్రూతలూగించిన ఎడ్వర్డ్ విల్సన్ నేడు కొత్త ఆలోచనలతో మళ్ళీ ప్రకోపింపజేస్తున్నాడు. మనకు విభిన్నంగా, విరుద్ధంగా కనిపించేవాటి మధ్య సమన్వయం సాధ్యమంటున్నాడు. అన్నింటికీ పరిష్కారం జీవశాస్త్రంలో చూడొచ్చు అంటున్నాడు. ఇందుకు ఆయన స్వీకరించిన పరిశోధన చీమలు!

చీమలకు మెదడులో 10 లక్షల కణాలే వున్నాయి. మనిషి మెదడులో వంద బిలియన్ కణాలున్నాయి. చీమల ప్రవర్తన, క్రమబద్ధత సాధ్యమైనప్పుడు మనిషి తన శక్తిని వినియోగిస్తే ఇంకెంతో సాధించగలడని విల్సన్ సిద్ధాంతీకరిస్తున్నాడు.

అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తున్న విల్సన్ ప్రస్తుతం 58వ పడిలో వున్నాడు. ఆయన పరిశోధనాలయంలో 538000 చీమల నమూనాలు, వర్గీకరణ నిమిత్తం సారాయిలో పెట్టి వుంచిన మరో 3 లక్షల చీమలు చూచేవారికి ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పటి నుండే అలబామా రాష్త్రం అడవులలో చీమల్ని సేకరించి, ప్రకృతిని అధ్యయనం చేసిన విల్సన్ పులిట్జర్ బహుమానం అందుకున్న రచయిత.

మన ప్రవర్తన మన తల్లిదండ్రుల జన్యుకణాల నుండి సంక్రమించిందని, వారి శిక్షణ నుండి పిల్లలు పుణికి పుచ్చుకుంటారని సిద్ధాంతీకరిస్తూ "సోషియోబయాలజీ" రాసినప్పుడు చాలామంది గగ్గోలు పెట్టారు. రానురాను విల్సన్ సోషియాలజీని సీరియస్ గా స్వీకరించి పరిశీలిస్తున్నారు.

నేడు జీవకణశాస్త్రం, ప్రకృతిశాస్త్రం, జీవకణశాస్త్రం ఎన్నో సూక్ష్మాలు అందిస్తున్నది. కనుక మెదడు ఆలోచనా స్రవంతి లోతుపాతుల్లోకి పోగలమని విల్సన్ అంటున్నాడు.