ఈ పుట ఆమోదించబడ్డది

సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు కార్ల్ శాగన్ ను కలిశాను. ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను. శాస్త్రీయంగా ఆయన అనేక విషయాలలో మతం పేరిట చేస్తున్న తప్పుడు వాదనలు బయటపెడుతున్నారు. ఆయన ఉపన్యాసాలు స్వయంగా విన్నాను. భారత హేతువాదులకు, మానవవాదులకు తన శుభాకాంక్షలు అందజేశారు.

మానసిక వైకల్యం, పిచ్చి అనే పేరుతో దొంగ చికిత్సలు చేస్తున్నవారిని తీవ్రంగా విమర్శిస్తూ థామస్ సాజ్ కృషి చేస్తున్నారు. ఆయన్ను కూడా కలిశాను. ఆయన పుస్తకాలు హేతువాదులు పరిశీలించాలి. ముఖ్యంగా మిత్ ఆఫ్ మెంటల్ ఇల్ నెస్ గమనించాలి. ఇండియాకు ఎవరైనా పిలిస్తే వస్తామన్నారు.

- శాస్త్రీయ హేతువాదం, జనవరి-ఫిబ్రవరి 1998
వెంకటేశ్వర సుప్రభాతం తెలుగులో పాడరెందుకు?

వెంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలో వుంది. రోజూ రేడియోలలో, టి.వి.లలో, మైకులు పెట్టి దేవాలయాలలో, ఇండ్లలోకేసట్లు వాడుతూ పారాయణం చేస్తున్నారు. సంస్కృతం తెలిసిన భక్తులు అతి స్వల్పం. కాని అలవాటుగా మిగిలిన భక్తులు అది విని తరించినట్లు భావిస్తున్నారు. వెంకటేశ్వర సుప్రభాత మహాత్మ్యం పై పత్రికలలో రాయించారు.

పిల్లల చేత కూడా యీ సుప్రభాతాన్ని పాడిస్తున్నారు. అర్థం లేని చదువు వ్యర్థం అంటారు గదా! పిల్లలకు అర్థం చెప్పకుండా వల్లే వేయించరాదు. కనుక అర్థం చెప్పరు. అర్థం తెలిసిన తరువాత పిల్లలకు వెంకటేశ్వర సుప్రభాతం చెప్పవచ్చునా లేదా అనేది స్పష్టపడుతుంది.

సుప్రభాతంలో 1వ శ్లోకం:

కమలాకుచ చూచుక కుంకమతో

నియతారుణి తాతుల నీలతనో

కమలాయతలోచన లోకపతే

విజయీభవ వేంకట శైలపతే

దీని అర్థం తెలుగులో యిది. లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమపూ రంగువల్ల అంతటా ఎర్రగా చేయబడ్డ సాటిలేని నల్లని శరీరం కలవాడా తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవాడా జగన్నాయకుడా, వెంకటాచలపతీ, జయించే స్వభావం కలవాడవు కమ్ము.