ఈ పుట ఆమోదించబడ్డది
విశ్వంలో శక్తులు

విశ్వంలో సైన్సు కనుగొన్న శక్తులు నాలుగు. ఈ శక్తిని తీసుకెళ్ళే కణాలు ఆధారంగానే నాలుగు రకాలుగా విభజన చేశారు. ఇందులో మూడు శక్తుల్ని సైన్స్ కలపగలిగింది. ఒకటిమాత్రం కలిసిరావదంలేదు. అందరికీ చిరకాలంగా తెలిసిన గురుత్వాకర్షణశక్తి ప్రత్యేకంగా కలిసి రాకుండా వున్నది. ఇది విశ్వవ్యాప్తంగా వున్నది. రెండు వస్తువుల మధ్య ఆకర్షణగా పనిచేసే యీ శక్తి ఎప్పుడూ తిప్పికొట్టదు. చంద్రుడికీ, భూమికీ మధ్యవున్న ఆకర్షణశక్తి యిలాంటిదే. అలాగే సూర్యుడికీ భూమికీ మధ్య గురుత్వాకర్షణ వున్నది. పరమాణువు నుండి పాలపుంతల వరకూ ఎక్కడబడితే అక్కడ గురుత్వాకర్షణ శక్తి వుంది. సూర్యునిచుట్టూ భూమి తిరగడానికి యీ శక్తే కారణం. గురుత్వాకర్షణ వుందని తెలిసినా, ఇంతవరకు వాటి తరంగాలను సైన్స్ పరిశోధనాలయాలలో పట్టుకోలేకపోయారు. అయినా ప్రయత్నాలు సాగిస్తూనేవున్నారు.

రెండవది విద్యుదయస్కాంత శక్తి. ఇది ఆకర్షిస్తుంది. తిప్పికొడుతుంది. రెండు పాజిటివ్ క్షేత్రాల మధ్య యిది తిప్పికొడుతుంది. ఒకటి పాజిటివ్ మరొకటి నెగటివ్ అయితే ఆకర్షిస్తుంది. విద్యుత్తులో ఇది మనకు నిత్యానుభవమే.

మూడోశక్తి న్యూక్లియర్ స్వల్పశక్తి. అణుధార్మిక (రేడియో యాక్టివ్) చర్యలో ఇది గమనించవచ్చు. విద్యుదయస్కాంతశక్తిలో ఇది కలపవచ్చునని 1967లో అబ్దుల్ సలాం, స్టేవెన్ వైన్ బర్క్ అనే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. 1979లో వీరికి నోబెల్ బహుమతి వచ్చినది కూడా. సూర్యుడిలో న్యూక్లియర్ అణుశక్తి విద్యుదయస్కాంతంగా మారడానికీ, మనకు వస్తున్న వెలుగునకు యిదే కారణం.

నాలుగోశక్తి న్యూక్లియర్ (బలీయ) శక్తి. అణుకేంద్రంలో ప్రోటానులు, న్యూట్రాన్లను కలిపి వుంచేటందుకు యీ శక్తి పనిచేస్తున్నది. ఈ శక్తులన్నిటినీ కలిపి చూడగల సిద్ధాంతానికై శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నారన్నాం గదా. మన మనుగడే ఐక్య సిద్ధాంతానికి దారితీస్తున్నదని హాకింగ్ పేర్కొన్నాడు.

ఇలాంటి కృషి జరపడంలోనే హాకింగ్, బ్లాక్ హోల్స్ గురించి ఎంతో కనుగొని మనకు వివరించాడు. బ్లాక్ హోల్స్ గురించి సైన్సులో వింత కథలు గాథలు బయలుదేరాయి. వాస్తవానికి దగ్గరలో వుండే విషయాలేమిటో చూద్దాం.

చీకటి తారలు
నల్లని నక్షత్రాలు! (బ్లాక్ హోల్స్)

నల్లని నక్షత్రాలున్నాయా? కంటితో చూస్తేగాని నమ్మను అన్నాడొక సైంటిస్టు. అలా చూడగలిగితే వాటిని నల్లని నక్షత్రాలని ఎందుకంటారు? అసలు అలాంటి నల్లని నక్షత్రాలు వున్నయా? ఉన్నాయని స్టీఫెన్ హాకింగ్ నిర్ధారణగా చెబుతున్నాడు. ఇందుకుగాను పరోక్షమైన ఆధారాలు చూపుతున్నారు. ఏమిటవి?