ఈ పుట ఆమోదించబడ్డది

తలుపులు మూసినాసరే, ప్రతిచోటా యిది పనిచేస్తూనే వుంటుంది.

మనం పడిపోకుండా అట్టిపెట్టేది గురుత్వాకర్షణే!

గతాన్ని చూడగలమా

మనం చూచే నక్షత్రాలు, సూర్యుడు పాలపుంత అన్నీ గతంలోవే.

8 నిమిషాల క్రితం వున్న సూర్యుడినే మనం చూడగలుగుతున్నాం.

మనం చూచే నక్షత్రాలు కోట్లాది సంవత్సరాల క్రితంలోనివే.

వెలుగు సెకండుకు 186282 మైళ్ళ వేగంతో ప్రసరిస్తుంటే అలా చూడగలుగుతున్నాం.

మనం మోసే బరువు ఎంత?

మనం ఒకచోట కదలకుండ కూర్చుంటే ఎంత బరువు మోస్తున్నట్లు?

వింత ప్రశ్నగా వుంది గదూ! వాస్తవానికి 10 టన్నుల బరువు మనపై పడుతున్నది.

భూమిపై వున్న గాలి చదరపు అంగుళానికి 14.7 పౌండ్ల వత్తిడి కలిగిస్తుంది. మన శరీరంపై అన్ని కోణాల నుండి ఈ గాలి బరువు వుంటుంది.

మనలోని అంగాలు, కణాలు అదేశక్తితో మనపై పడే గాలి శక్తిని వెనక్కు తిప్పికొడుతుంటాయి. కనుకనే 10 టన్నుల బరువుతో పడేగాలికి మనం అణగిపోవడంలేదు.

గాలిలేని శూన్యంలో మనిషిని పెడితే పటాపంచలైపోతాడని తెలుసుకోండి!

పోలరైజ్డ్ అద్దాల శక్తి

ప్లాస్టిక్ గ్లాస్ తో చేసిన కళ్ళజోడు పెట్టుకుంటే చాలా మార్పు జరుగుతుంది. ప్లాస్టిక్ లో ఏటవాలు కణాలు (elongated molecules) కలిసి రంధ్రం వలె ఏర్పడతాయి. ఈ రంధ్రాలు అడ్డంగా అమర్చితే అడ్డంగా ప్రసరించే తరంగాలనే పోనిస్తుంది.

రైట్ కోణంలో అమర్చిన రెండు ఫిల్టర్ల గుండా వెలుగు ప్రసరించదు. అంటే ఒకటి అడ్డంగా, మరొకటి నిలువుగా అమర్చిన గ్లాస్ ద్వారా వెలుగు తరంగాలను పోనివ్వదు.

స్థిరత్వంలో చలనం

కదలకుండా పడివున్నదనుకునే ఏ వస్తువులోనైనా చలనం వుంటుంది. మనం చూచేవాటికీ, లోన జరిగేదానికీ చాలా తేడా వుంది.