ఈ పుట ఆమోదించబడ్డది

హాని చేస్తుంది. కొంతసేపు అట్టిపెడితే పగటి కలలు వస్తాయి. భ్రమలు కలుగుతాయి. ఆ తరువాత దశలో మైకంకమ్మినట్లు దీర్ఘనిద్రావస్తలోకి పోతారు. అటువంటి దశ నుంచి యధాస్తితికిరావడానికి కొంతసేపు పడుతుంది. కానీ, ఆ దశను కొందరు ముక్తికి చేరువైన సమాధి దశగా చెపుతారు. రామకృష్ణ పరమహంస విషయంలో యిలానే జరిగింది. శరీరానికి యీ దశలో హాని జరుగుతుంది.

యోగాభ్యాసాల వలన ఏదైనా జరిగితే అందుకు బాధ్యత వహించే వారెవరూ లేరు. మళ్ళా ఆధునిక చికిత్సకు పోవాల్సిందే.

ఆధునిక వైద్యరంగానికి యోగాన్ని జోడించే ఎత్తుగడ కొన్ని ఆశ్రమాల వారు ఇటీవల వాడుకలోకి తేవడం వారి వ్యాపారాన్ని తెలివిగా ఆధునీకరణ చేయడానికే.

ప్రపంచంలోనే మేధావివర్గానికీ సాధారణ ప్రజానీకానికి మధ్య అగాధం పెరుగుతున్నది. అందువల్లనే విజ్ఞాన శాస్త్రానికీ, సనాతనవాదానికి మధ్య సంబంధం లేకుండా పోతున్నది. అందువల్లనే సాధారణ ప్రజానీకం మతవాదాల్లో నిమగ్నమై ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాలను అందుకోలేక సతమతమైపోతున్నారు. కాగా విజ్ఞానశాస్త్ర ఫలితాలైన సాంకేతిక పరికరాలను వాడుకోవలసిన పరిస్థితిలో ఈనాడు మతం పడిపోయింది. ఇది ఆధునిక జాడ్యాలకు ఒక కారణం కాగా, ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ప్రవేశించాం. ఇది సాధారణ పౌరుడికి మాయాలోకంలాగా దర్శనమిస్తుంది. అర్ధమయ్యేస్థితిలో లేదు. అంటే విజ్ఞానికీ సాధారణుడికీ మధ్య పూడ్చరాని అగాధం మిగిలిపోయింది. ఇది ప్రమాద సంకేతం. వేల సంవత్సరాలనాడు ఈ స్థితిలోనే సాధారణమానవుడికంటే భిన్నంగా పౌరోహిత వర్గం పెరిగిపోయింది. అందునా భారతదేశంలో ఆ వర్గం సాధారణ ప్రజానీకానికి అందనంత దూరంగా జరిగి మానవుడిలో తారతమ్యాలను చాలా పెంచివేసింది. ఈ చారిత్రక సత్యాన్ని మనం గుర్తిస్తే, కేవలం అక్షరజ్ఞానం కాకుండా వైజ్ఞానిక తాత్విక ఫలితాలు సామాన్య ప్రజలదాకా మనం మోసుకువెళ్లాలి. అది మన బాధ్యత.

- హేతువాది, అక్టోబరు 2001
జపాన్ దిగుమతి రేకి చికిత్స

విదేశాల నుండి మనకు అనేక మార్గాంతర వైద్య చికిత్సలు వచ్చాయి. అందరూ తమది సైంటిఫిక్ అని ముద్ర వేసుకొంటున్నారు. విచారణ జరిపి, నిగ్గు తేల్చే వైద్యసంస్థ లేదు గనుక, ఎవరికి చేతనైనంత వారు సంపాదించుకొని, జబ్బు మనుషుల్ని బాగా వాడుకుంటున్నారు.

ఇప్పుడు మార్కెట్ లో రేకి (REY-KEY అని పలుకుతారు)కొత్తగా వ్యాపిస్తున్నది. ఇది జపాన్ నుండి వలస వచ్చింది. ఇప్పటికే అమెరికా యూరోప్ లకు వ్యాపించిన రేకి వైద్యం, భారతదేశంలో అడుగిడింది.