ఈ పుట ఆమోదించబడ్డది

సాంకేతిక విజ్ఞానం వలన మూఢనమ్మకాలు అతి వేగంగా ప్రపంచమంతటా వ్యాపించే అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వినాయకుడి విగ్రహం పాలుతాగిందనే అంథవిశ్వాసం అతి త్వరలో అమెరికాకు పాకింది. మేరీమాత కళ్ళవెంట నీళ్ళు,రక్తం చిందినట్లు అమెరికాలో కలగిన భ్రమపూరిత మోసం ఇండియాకు వెంటనే వ్యాపించింది. కంప్యూటర్లను సైతం మూఢనమ్మకాల వ్యాప్తికే వాడి చెడగొడుతున్నారు.

పిల్లలు తొందరగా నమ్ముతారు. తల్లిదండ్రులు వారికి ప్రమాణం. తరువాత స్నేహితులు, ఆ పిమ్మట బడిలో ఉపాధ్యాయులు. పిల్లలకు నమ్మకాలు ఎంత త్వరగా వస్తాయో అంతతొందరగా పోతాయి కూడా. కాని వాటిని పోనివ్వకుండా పదేపదే పునశ్చరణ చేయడంతో మూఢనమ్మకాలు గట్టిగా నాటుకుపోతాయి. చిన్నప్పుడు చాలా స్థిరపడిన నమ్మకాలు ఒక పట్టాన వదలవు. సైంటిస్టుగా, సాంకేతిక నిపుణునిగా, ఉపాధ్యాయుడిగా, డాక్టర్ గా పెరిగిన పిల్లవాడిలో చిన్నప్పటి నమ్మకాలు అలాగే తిష్టవేస్తాయి. తన వృత్తివరకూ నైపుణ్యంగా చేసినా మిగిలిన విషయాలలో కార్యకారణ సంబంధాలు శాస్త్రీయపద్ధతి అమలు చేయకపోడానికి ఇదే కారణం.

పిల్లల పట్ల మనం చాలా అపచారం. తెలిసో తెలియక చేస్తున్నాం.మన నమ్మకాల్ని వారికి అందించడమే యీ అపచారం. మానసిక వికాసాన్ని చంపేయడం కంటే ఘోరమైన తప్పు మరొకటి లేదు.

పిల్లల్ని ఆస్తిగా భావించరాదని పిల్లల మనోవికాసాన్ని వ్యక్తిత్వాన్ని గుర్తించాలని ఇక్యరాజ్యసమితి 1989లో ఒక చట్ట ప్రకరణ రూపొందించింది. ఇది ఇంకా ప్రచారంలోకి రావాలి.

మనకు తెలియంది తెలియదు అనడానికి, పిల్లలముందు ఆ మాట అనడానికి మనో నిబ్బరం కావాలి. తెలుసుకొని చెబుతాం అనగలగాలి. గుడ్డిగా దండాలు పెట్టించరాదు,మొక్కించరాదు. పిల్లలకు దూరంగా వుంచాల్సిన విషయాలలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ఆధారాలు లేని అయోమయ విషయాలు అనేది గుర్తించాలి.

ఆలోచనలకు పదునుపెట్టాలి గాని చంపేయరాదు.ఇది కష్టమే కాని సాధ్యం.

- వార్త, 30 డిసెంబరు,2001
భవిష్యత్తు చూడగలమా? చెప్పగలమా?

మనకు వీరబ్రహ్మం వున్నట్లే ఫ్రాన్స్ లో మైకల్ నోస్ట్రాడమస్ వున్నాడు. వీరిరువురూ చెప్పిన ప్రవచనాలు, సూక్తులు భవిష్యత్తును చెప్పినట్లు కొందరు నమ్ముతారు. రాత్రిళ్ళు విమానాలు ఎగరడం, భూకంపాలు రావడం, ఇలా ఏది కొత్తగా జరిగినా అదంతా లోగడే మనవాళ్ళు చెప్పరంటారు.