ఈ పుట ఆమోదించబడ్డది
నాస్తికులు - హోమియో

నాస్తికులు, హేతువాదులు, మాననవాదుల్లో అక్కడక్కడా కొందరు హోమియో వైద్య వృత్తి చేస్తున్నారు. అది శాస్త్రీయం కాదనే విమర్శ వచ్చినప్పుడు వారి వృత్తి దెబ్బతింటుందనే దృష్ట్యా, సమర్ధించుకుంటున్నారు. విమర్శలకు హేతుబద్ధంగా శాస్త్రీయంగా సమాధానం చెప్పకుండా, మొండి వైఖరి అవలంబిస్తున్నారు. కొన్నిటిల్లో శాస్త్రీయంగా వుండాలని, కొన్నిటిల్లో శాస్త్రీయంగా వుండకపోయినా ఫరవాలేదనే ధోరణి సరైనది కాదు.

హోమియో విషయమై ప్రపంచ వ్యాప్తంగా మానవవాదులు, హేతువాదులు శాస్త్రీయ పరిశీలన చేశారు. ఇందుకుగాను ప్రసిద్ధ శాస్త్రజ్ఞుల సహాయం స్వీకరించారు. హోమియో శాస్త్రీయం అని రుజువు అయితే అంగీకరించడానికి నాస్తికులు, మానవవాదులు సిద్ధమే. కాని పరిశోధన, పరిశీలనలో ఎన్ని టెస్ట్ లు చేసినా సైంటిఫిక్ అని రుజువు కాలేదు.

శాస్త్రీయ పద్ధతి విశ్వవ్యాప్తమైనది. ఇండియాలో చేసినా అమెరికాలో చేసిన అఫలితాలు ఒకేరకంగా వస్తాయి. ఒకరు రుజువు పరిస్తే అదే పరీక్షలు ఇంకొకరు జరిపినా అదే ఫలితాలు వస్తాయి. ఖమ్మంలో రుజువు అయితే కాలిఫోర్నియాలోనూ అవే ఫలితాలు వస్తాయి. అందుకే శాస్త్రీయపద్ధతి విశ్వవ్యాప్తమైనది. ఇందులో రాగద్వేషాలకు తావులేదు. మన వాళ్ళకు ఒక నిబంధన, మరొకళ్ళకు మరొక రూల్ శాస్త్రీయ పద్ధతిలో వుండదు. ఇదే హోమియోకూ వర్తిస్తుంది. నాస్తికులలో, హేతువాదులలో హోమియో ప్రాక్టీసు ఎవరైనా చేసినంత మాత్రాన అది రుజువుకు అతీతం కాదు. పోనీలే, మనవాడుగదా అని మినహాయించలేం.

హోమియో మందులు 30 ఎక్స్ మొదలు ఏవైనా సరే తీసుకొని, యిష్టం వచ్చిన లాబొరేటరీ (పరిశోధనాలయం) లో పరీక్షకు పెట్టండి. అందులో ఏ మందూ వుండదు. అయినప్పుడు ఎలా పని చేస్తుంది?

హోమియో ఔషధాలు తయారుచేయడంలో అవలంబించే పద్ధతి ప్రకారం ఒక పాలు పదార్థం, 10 పాళ్ళు సారాయి లేదా నీరు కలిపి కుదుపుతారు. అందులో నుంచి మళ్ళీ ఒక పాలు తీసుకొని మరో 10 పాళ్ళు సారాయి కలిపి కుదుపుతారు. ఇలా కుదుపుతూ పోతుంటే కొంతసేపటికి కనీసం ఒక్క అణువు కూడా మూలపదార్థం లేకుండా పోతుంది. 30 ఎక్స్ హోమియో మందులో ఒక పాలు మందు వుంటే సారాయి పాళ్ళు 1000 000 000 000 000 000 000 000 000 000 000 000 అన్నమాట. అంటే 7874 గాలన్ల నీటిలో లేదా సారాయిలో ఒక అణువు హోమియో వుంటుదన్న మాట. 200సి లో 10400 అణువుల సారాయి / నీటికి ఒక హోమియో అణువు వుంటుంది. అంటే 1కి 400 సున్నాలు చేర్చి చూచుకోవాలి.

విజ్ఞానశాస్త్రం ప్రకారం విశ్వంలో అణువులన్నీ 1080 (1కి 80 సున్నాలు చేర్చాలి) వున్నాయి.