ఈ పుట ఆమోదించబడ్డది

31న) అందరూ అనేదేమంటే,సాధారణ విషయాన్ని ఎజికె చెబితే అది అసాధారణంగా మారుతుందని!

సమాజాన్ని ప్రభావితం చేసిన జర్నలిజం ఎజికెది. ఎజికె రచనలు ఇంకా పుస్తకరూపం రాల్చవలసి వుంది. పరిశోధన జరగాల్సివుంది. "నా అమెరికా పర్యటన" పుస్తకం తప్ప, మిగిలినవన్నీ వ్యాసాలే. ఇంగ్లీషులో తక్కువగానూ, తెలుగులో విపరీతంగానూ వున్న వ్యాసాలు, అనేక రచనలకు ఆయన పీఠికలు పరిచయాలు సమగ్ర సంపుటాలుగా రావాలి. ప్రసంగ టేప్ లు వుంటే అవికూడా భద్రపరచవలసి వుంది.

జర్నలిస్టులపై ఎజికె ప్రభావానికి నిదర్శనగా ఒక అంశం ప్రస్తావిస్తాను. 1954లో ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన మద్రాసు నుండి వెలువడే ఆంధ్రప్రభ సంపాదకీయ ప్రస్తావన చేయలేదు. దేశంలోని ప్రముఖ పత్రికలన్నీ రాశాయి. గుంటూరులో ఏకాదండయ్య హాలులో సంతాపసభ జరిగింది. ఎజికె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రభ విలేకరి సోమయాజులు యథాతథంగా పంపారు. "ఎవడో దారినపోయే టొంపాయ్ చనిపోతే,ఒక వటవృక్షం కూలింది, ఒక తార రాలింది అని సంపాదకీయాలు రాసే ఆంధ్రప్రభకు ఎం.ఎన్.రాయ్ ఎవరో తెలియదా" అని ఎజికె చేసిన వూఅఖ్యానం నార్ల వెంకటేశ్వరరావును తగిలింది. వెంటనే ఎం.ఎన్.రాయ్ రచనలు తెప్పించుకొని, కూలంకషంగా చదివి, మరుసటేడు గొప్ప సంపాదకీయం రాశారు. అప్పటినుండీ ఎజికె,నార్ల మిత్రులయ్యారు.

- వార్త,21 అక్టోబరు,2001