ఈ పుట ఆమోదించబడ్డది

ప్రచురించాం. కర్నూలు జిల్లా పరిషత్తు అధ్యక్షుడుగా కోట్ల విజయభాస్కరరెడ్డి, విద్యామంత్రిగా పి.వి.నరసింహారావు సహరించగా ఒక సభ జరిపి, గోరాశాస్త్రిగారికి కొంత ఆర్థిక సహాయం వసూళ్ళ ద్వారా అందించగలిగాం.

హైదరాబాద్ లో రేడియో చర్చలలో గోరాశాస్త్రి పాల్గొనేవారు. మద్రాసు నుండే ఆయన రేడియో నాటికల ప్రత్యేకత సాధించారు. "ఆశ ఖరీదు అణా" అనే కథ నుండి అనేకం పాఠకుల మన్ననలు పొందాయి. దిగంబర కవుల రచనలు గోరాశాస్త్రి విమర్శలకు గురయ్యాయి. అర్థరాత్రి నాంపల్లి స్టేషన్ వద్ద రిక్షాకూలితో ఆవిష్కరించిన తొలి పుస్తకాన్ని గోరాశాస్త్రి ఎద్దేవా చేసేవారు. జీరాలో గోరా అంటూ కమ్యూనిస్టు కవులు ఆయన్ను విమర్శించేవారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వాన్ని బాగా మెచ్చుకుంటూ, పోగారితనం ఆయన శిల్పంలో వుందనేవాడు. కాని వ్యక్తిగా కృష్ణశాస్త్రి అబద్ధాన్ని జీవించాడనేవాడు.

రామోజీరావుగారు ఈనాడు పత్రిక పెట్టడానికి సంకల్పించినప్పుడు గోరాశాస్త్రిని సంప్రదించారు. హైదరాబాద్ అబిడ్స్ లో వున్న మార్గదర్శి కార్యాలయంలో చాలా పర్యాయాలు సాయంకాలాలలో యీ సమావేశాలు జరిగాయి. అందులో నేనూ పాల్గొన్నాను. కొత్త పత్రిక ఎదుర్కోబోయే సమస్యలు, దినపత్రికల తీరుతెన్నులు,విదేశాలలో పత్రికల వ్యపహారం మొదలైన అంశాలు చర్చకు వచ్చేవి. గోరాశాస్త్రి తన అనుభవాల దృష్ట్యా రామోజీరావుతో అనేక అంశాలు చెప్పేవారు. ఆయన శ్రద్ధగా వినేవారు. ఆ సమావేశాలలో ఏర్పాటు కొంతకాలం సాగిన తరువాత 'ఈనాడు' వెలువడింది. నేను ఆ చర్చలలో పాల్గొనడం వల్ల గోరాశాస్త్రిగారి మద్రాసు అనుభవాలెన్నో గ్రహించగలిగాను. 1970 ప్రాంతంలో నార్ల వెంకటేశ్వరరావు అన్నా, ఆయన సంపాదకీయాలన్నా గోరాశాస్త్రికి గిట్టేవికావు. మద్రాసు నుండే వారిరువురికీ సఖ్యతలేదు. ఖాసా సుబ్బారావు గొప్పతనం ఎన్నోవిధాల గోరాశాస్త్రి కొనియాడుతుండేవారు. టంగుటూరి ప్రకాశం జర్నలిజం గురించి కడుపుబ్బ నవ్వించే విశేషాలు చెప్పేవారు.

స్టీవెన్ స్పెండర్ ఆంగ్లకవిత్వం పట్ల గోరాశాస్త్రికి ప్రత్యేక మోజు వుండేది. గోరాశాస్త్రి సంపాదకీయాలలో కొన్ని, ఆయన నాటికలు, కథలు ఈతరం వారికి అందవలసివుంది. గోరాశాస్త్రిగారికి అండగా నిలచి చివరివరకూ సహాయపడిన ఖ్యాతి మిత్రులు సి.ధర్మారావుదే. దూరతీరాలు, ఆనందనిలయం, పరువుకోసం పోతే వంటి రచనలు పునర్ముద్రణ అయితే బాగుంటుంది. 1982 మేలో ఆయన మరణించిన అనంతరం గోరాశాస్త్రిని యిప్పుడిప్పుడే మళ్ళీ తలుస్తున్నారు. డా॥పి. తిరుమలరావు తన స్వీయ చరిత్ర కట్టలుగా రాసి, గోరాశాస్త్రి దగ్గర పడేసేవారు. ఆయన చిత్రికపట్టి, శైలిపెట్టి, నానాతిప్పలుపడి ఒక క్రమం సమకూర్చేవారు. ఆవిధంగా అనేకమందికి గోరాశాస్త్రి సాహిత్యసేవ చేశారు.

- వార్త,20 జనవరి,2002