ఈ పుట ఆమోదించబడ్డది

కాటన్ మెదటినుండీ ఒక వాదన చేస్తూ వచ్చాడు: ఇక్కడ కూలీలచేత పని త్వరగా చేయించవచ్చు, సంవత్సరానికి ఆరు మాసాలు నిర్విఘ్నంగా ఆనకట్టపని సాగించవచ్చు. ఆనకట్టతో పాటు వెన్వెంటనే కాలువల త్రవ్వకం సాగితే గాని,ప్రజలకు ఉపయోగం జరగదు. రైళ్ళపై డబ్బు తగలేసే కంటే, నీటివనరులపై ఆ డబ్బు వినియోగిస్తే అటు రవాణాకు యిటు భూమి అభివృద్ధికీ ఉపయోగపడుతుంది కనుక ఒక లక్ష పౌండ్ల చొప్పున ఐదేళ్ళపాటు వరుస డబ్బు మంజూరు చేస్తే పనంతా పూర్తి అవుతుంది. ఫలితం ఆశాజనకంగా వుంటుంది, అంటే ప్రభుత్వం పెడచెవిని బెట్టింది. మొత్తం ప్రాజెక్టు పనులన్నీ పూర్తి గావటానికి 27 సంవత్సరాలు పట్టింది. ఈలోగా అంచనాలు తారుమారయ్యేవి. కూలీ ధర పెరిగింది. ఇట్లా అంటీ అంటనట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది.

కష్టాల మధ్య కాపురం

ఆర్థర్ కాటన్ మాత్రం పట్టుదలతో ఆనకట్ట పని పూర్తి గావించాడు. అప్పుడే ఒక ఏడాది ప్రాయంలో కుమార్తె చనిపోయింది. ఇంట్లోకి ఎప్పుడూ పాములు వస్తుండేవి. గుట్టలు ప్రేల్చుతుంటే రాళ్ళు యింటి మీద పడుతుండేవి. ఆరోగ్యం అంతంతమాత్రంగాగల కాటన్ ఎండలకి తట్టుకోలేకపోయాడు. ఎండదెబ్బ అతన్ని మంచాన పడేసింది. సెలవుబెట్టి, బాధతో కొన్నాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. తాను వెడుతూ ఓర్ అనే సమర్ధుడైన ఇంజనీరుకు పని అప్పగించి వెళ్ళాడు.

కాటన్ ఉండగానే, 1849లో పెద్ద వరద వచ్చింది. గంటకు 18 అంగుళాల చొప్పున నది పొంగింది. దానితోపాటు సుడిగాలి వచ్చింది. ఆ దెబ్బతో మొత్తం ఆనకట్ట కొట్టుకపోయిందనే భయపడ్డారు, 22 గజాలు గండిపడి ఆ మేరకు కట్ట కొట్టుకుపోయింది. మరొకచోట 44 గజాల గండిపడింది.అయితే వర్షాకాలం ముమ్మరంగా రాకమునుపే ఆ గండ్లు పూడ్చి ఆనకట్టను నిలబెట్టగలిగారు. మొదటి ఐదేళ్ళు లాకులపై ఖర్చు అవసరం లేకుండా పోయింది రిపేర్లు కూడా అక్కరబడలేదు. ఆనకట్టవద్ద కావలసినంత క్వారీ రాయి లభించటం, అడవులనుండి పెద్ద దూలాలు దొరకటం, యిట్లాంటి సౌకర్యాలన్నీ కాటన్ బాగా సద్వినియోగపరుచుకున్నాడు.

చేసిన పని సక్రమంగా ఉపయోగపడే నిమిత్తం, శిక్షణపొందిన నిపుణులను శాశ్వతంగా నియమించమని కాటన్ అభ్యర్ధించాడు. 1854 నాటికి ఆనకట్ట పని పూర్తి అయింది. కాటన్ సంతృప్తిపడ్డాడు. గోదావరి ప్రజలు మళ్ళీ తలెత్తుకున్నారు. ఆదాయం పెరిగింది. జనాభా పెరగజొచ్చింది. ప్రభుత్వం కూడా తృప్తిపడింది. కాలువలన్నీ త్రవ్వక పూర్వపు మాట యిదంతా.

స్థూలంగాచూస్తే ఆనకట్ట పూర్తి అయిన తరువాత ఏడు లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. జిల్లా ఆదాయం 2,30,000 నుండి 5,70,000కి పెరిగింది. ఎగుమతులు 60,000 నుండి 80,000 పెరిగాయి. 1852లో నరసాపూర్, అత్తిలి కాలువ త్రవ్వగా ఆ ఒక్క