ఈ పుట ఆమోదించబడ్డది

నన్ను కాదని ఎవరినో పంపిస్తారా అని నాటి బ్రిటిష్ కలెక్టర్ కినుక వహించి అతనికి సహకరించలేదు. అయినా మౌంట్ మోరి పరిస్థితి చూచి ప్రభుత్వానికి నివేదించాడు. ఇది 1844 నాటి గాధ. ప్రభుత్వం కళ్ళు తెరిచింది. కరువు నివారణకై ఏం చేయాలో ఆలోచించసాగింది.

కరవులో కాటన్ ప్రవేశం

అట్లాంటి దారుణ పరిస్థితిలో సర్ ఆర్థర్ కాటన్ వచ్చాడు. అతను అప్పటికే కావేరి నదిని మళ్ళించి తంజావూరు ప్రజలకు సేవలు చేసి ఉన్నాడు. అనారోగ్య కారణంగా విశాఖపట్టణంలో చర్చి నిర్మాణం వంటి తేలిక పనులు చేస్తున్నాడు. ప్రభుత్వ కోరికపై గోదావరినది ప్రాంతమంతా సర్వే చేశాడు. సుదీర్ఘమైన నివేదిక సిద్ధం చేశాడు, ఘాటైన మాటలతో ప్రభుత్వాన్ని ఎత్తిపొడిచాడు. సైన్సు, నాగరికత వున్నదనుకొనే బ్రిటిష్ వారు పరిపాలిస్తూ కూడా ప్రజల్ని యీ విధంగా ఉంచడం, నీటిని సద్వినియోగం చేసుకునేటందుకు తోడ్పడకపోవడం గర్హనీయమన్నాడు. అప్పటికీ 40 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు గోదావరి ప్రజల సంకటస్థితిని చూస్తూ మిన్నకుండడం క్షంతవ్యం కాదన్నాడు. గోదావరి ప్రాంతమంతా చెరకు పండిస్తే ఎగుమతులు పెరుగుతాయనీ, ప్రజల ఆదాయం ప్రభుత్వాదాయం పెరిగి ఉభయ కుశలోపరిగా ఉండొచ్చన్నాడు. 1845 ఏప్రిల్ 17న తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాడు. తదనుగుణంగా గోదావరికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించడం ముఖ్యం. వరదల బారినుండి పంటల్ని కాపాడటానికి కరకట్టలు వేయటం, పంటలకు ప్రయాణాలకు తోడ్పడే కాలువలు త్రవ్వటం, మురుకినీటిపారుదల సౌకర్యాలు అమర్చటం, ధాన్యం రవాణా దృష్ట్యా అవసరమైన రోడ్లు, బ్రిడ్జీలు నిర్మించటం తక్షణ కర్తవ్యాలన్నారు. దీనివలన ఎంత ఖర్చు అయ్యేదీ, ఏ విధంగా ఆదాయం వచ్చేదీ అంచనా వేసి చూపాడు. మొత్తం ఖర్చు 1,20,000 పౌండ్లు కాగా, ఒక్క ఆనకట్ట వరకూ 45,575 పౌండ్లు అవుతుందన్నాడు, నాటి పౌండు విలువ పది రూపాయలు. కాటన్ నివేదికను ఇండియాలోనూ, ఇంగ్లండులోనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎట్లాగైతేనేమి అతని పథకాన్ని ఆమోదించారు.

ఆనకట్ట చరిత్ర

గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట పని 1847లో ప్రారంభమైంది. కాటన్ ఛీఫ్ ఇంజనీరుగా పనిచేపట్టి, ధవళేశ్వరం వద్ద యిల్లు వేసుకొని నిర్విరామ కృషి చేశాడు. పనివారంతా అతన్ని "సన్యాసి" అనేవారు. నిష్కామకర్మగా అతను చేస్తున్న పనినిబట్టి వారట్లా పిలిచేవారు. 1847లో ఆనకట్ట ప్రారంభించినది మెదలు 1850 వరకూ 30,54,413 మంది కార్మికులు అక్కడ పనిచేశారు. రోజుకు సగటున 2500 నుండి 3500 మంది కూలీలు ఉండేవారు. ఆనకట్ట నిర్మాణం ప్రారంభించినది మొదలు కాటన్ కు ప్రభుత్వ తోడ్పాటు అంత ఉత్సాహకరంగాలేదు. సర్వేకుగాను ఒక వెయ్యి పౌండ్లు యిచ్చారు. తొలుత ఆరుగురు ఆఫీసర్లనడిగితే ముగ్గురినే యిచ్చి సరిపెట్టుకొమ్మన్నారు. అదీ అనుభవంలేని వారిని పంపించారు.