ఈ పుట ఆమోదించబడ్డది
అమెరికాలో ఆవుల గోపాలకృష్ణమూర్తికి హెచ్చరిక!

అమెరికాలో పర్యటించినా ఆంధ్రలో వున్నా ఆవుల గోపాలకృష్ణమూర్తి విశిష్ట హ్యూమనిస్టుగానే ప్రవర్తించాడు.

1964లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై 3 మాసాలు పర్యటించిన ఆవుల గోపాలకృష్ణమూర్తి (ఎ.జి.కె)కి సంబంధించిన కొత్త విశేషం తెలిసింది.

అప్పట్లో బి.కె.నెహ్రూ భారత రాయబారిగా అమెరికాలో వున్నాడు. ఆయన భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బంధువు కూడా. నెహ్రూ విధానాలు నిశితంగా పరిశీలించిన ఎ.జి.కె.ను అమెరికాలోని భారత రాయబారి హెచ్చరించాడట, ఏమని?

జవహర్ లాల్ నెహ్రూను అమెరికాలో విమర్శిస్తే, ఎ.జి.కె.ను బలవంతంగా ఇండియా పంపివేయాల్సి వస్తుందని!

కాని, ఎ.జి.కె. తన విమర్శలు ఏ మాత్రం సడలించలేదు. హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు. తాను హేతుబద్ధం అనుకున్న విమర్శ చేశాడు.

ఆనాడు ఎ.జి.కె.చికాగోలో వడ్లమూడి శ్రీకృష్ణకు అతిధి. శ్రీకృష్ణగారు ప్రస్తుతం వాషింగ్టన్ సమీపంలో మేరీలాండ్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయాన తెనాలి తాలూకా మోపర్రు వాసి ఎ.జి.కె.పట్ల భారత రాయబార కార్యాలయం ప్రవర్తన గురించి వడ్లమూడి శ్రీకృష్ణ నాకు యిటీవలే వెల్లడించారు.

అమెరికాకు ఆహ్వానించిన వారిలో ఎ.జి.కె. వంటి వ్యక్తి చాలా అరుదైన వారని అమెరికా ప్రభుత్వం భావించిందట.

ఎ.జి.కె.కుమార్తె జయశ్రీ పెళ్ళి నిశ్చయమైన సందర్భంగా మద్రాసు నుండి బి.ఎస్.ఆర్ కృష్ణ వచ్చి ఆహ్వానం అందజేశారు. అది ఆనాడు హ్యూమనిస్టులకు పెద్ద పండుగ. పెళ్ళిలో ఆవుల సాంబశివరావు ఆధ్వర్యాన కవి సమ్మేళనం జరుగుతుండగా అమెరికాకు ఎ.జి.కె. ఆహ్వానం కూడా ఒక సంబరంగా సాగింది.

ఎ.జి.కె.ఆహ్వానాన్ని భరించలేని వ్యక్తులు కొందరు వివేకానంద పేరిట కొత్త ఎత్తుగడకు పూనారు. సన్మానం పెట్టి అమెరికాలో వివేకానంద గొప్పతనం చెప్పిరమ్మనారు. అలాంటి భట్రాజీయం తాను చేయనని, ఉన్నది ఉన్నట్లు వివేకానంద గురించి చెబుతాననీ, అదీ ప్రస్తావన వస్తేనే మాట్లాడతాననీ ఎ.జి.కె. అన్నారు.

ఇంకేముంది? ఆ మాట పట్టుకొని, ఆనాడు ఆంధ్రప్రభ సంపాదకుడుగా వున్న నీలంరాజు వెంకటశేషయ్య (కంచి శంకరాచార్య పాదపూజ భక్తుడు) ధ్వజమెత్తాడు.ఎ.జి.కె.ను అమెరికా వెళ్ళనివ్వరాదని, వెళ్ళినా వెనక్కు పిలిపించాలని లేఖలు ప్రచురించారు. హైందవం నాలుగు పడగల నాగు అలా ఫాసిజం వెదజల్లింది. కాని అమెరికా ప్రభుత్వం గాని, భారత ప్రభుత్వం గాని, యీ ఫాసిస్టు విమర్శలు పట్టించుకోలేదు.