ఈ పుట ఆమోదించబడ్డది

సాంగత్యం, లైబ్రరీలో మార్కిస్టు సాహిత్యం పరిచయమైంది. జాతీయవాదం సడలడం ఆరంభమైంది. పూర్తిగా పోవడానికి కొంతకాలం పట్టింది. అమెరికాలోనే నరేంద్రనాధ్ పేరు మానవేంద్రనాధ్ గా మారింది.

మానవులంతా సమానం అని మానవ హక్కులు ప్రపంచవ్యాప్తంగా అమలు పరచాలన్నప్పుడు, సంకుచిత జాతీయవాదం ఎలా పనికొస్తుంది? మన మతం మంచిదని వివేకానంద, హిందూమతాన్ని గురించి ప్రచారంచేస్తే అందులో విశ్వజనీనత ఎంతవరకు వుంది? అని ఆలోచించాలి.

జాతీయవాదాన్ని, తరువాత మార్క్సిజాన్ని కాదని, శాస్త్రీయపంధాలో మానవవాదాన్ని అవలంబించిన ఎం.ఎన్.రాయ్ చాలామందికి రుచించకపోవచ్చు. అతడి సిద్ధాంతాలు జీర్ణం కావడానికి కాలం పట్టొచ్చు. భారతదేశం వివేకానందను తృణీకరించి, ఎం.ఎన్.రాయ్ ను అనుసరిస్తే, మిగిలిన ప్రపంచంతో పాటు ముందంజ వేసేదే. ఇప్పుడు ఆ ప్రయత్నమే జరగాలి.

- హేతువాది, మార్చి 1992
ఆవుల గోపాల కృష్ణమూర్తి
(స్కెచ్)

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మూల్పూరు గ్రామంలో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో కనిష్టుడుగా ఏప్రియల్ 29-1917లో జననం. ఉన్నత పాఠశాలా విద్యాభ్యాసం తురుమెళ్ళలో. ఆనాడే విద్యార్థులలో వేరుగా మసిలాడు. ప్రైవేటుగా తెలుగు చదువుకున్నాడు. అప్పుడే 'కృష్ణశతకం' వ్రాసాడని వినికిడి. కళాశాల విద్యాభ్యాసానికి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరినప్పటినుండి ప్రతిభావ్యుత్పత్తులు విప్పార నారంభించినవి. స్వగ్రామంలో జి.బి.యస్. సరస్వతీ స్వాములవారితో తాత్త్విక చర్చ ఫలితంగా కలానికి పదునెక్కింది. సెలవుల్లో యింటికి వచ్చి, పురాణ శాస్త్రులకు పోటీగా తానూ మహాభారత ఘట్టాలను పురాణంగా చెప్పాడు. అది విని బ్రహ్మానందభరితులైన తల్లి దిష్టి తీసెయ్యటం యేమంత విశేషంకాదేమో.

గుంటూరు కళాశాలా జీవితంలో భవిష్యత్తుకు పునాదు లేర్పడ్డయ్. ఇంగర్ సాల్, త్రిపురనేని రామస్వామి రచనలు ఛాందస భావాల్ని ఛేదించటానికి వుపకరించగా, ఆ ప్రోత్సాహం మున్ముందుకు నడిపించింది. పట్టణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడటం అందులో భాగమే. అప్పుడే కర్ణాకర్ణిగా ఎం.ఎన్.రాయ్ ని గురించి విని, తెలుసుకోవాలనే జిజ్ఞాసలోవుండగా, ఒకానొక కమ్యూనిస్టు రాయ్ ని దూషిస్తుంటే, సాచి చెంపపెట్టు పెట్టిన ఉద్రేకి గొపాలకృష్ణమూర్తి. ఆప్తమిత్రుడు ఎలవర్తి రోసయ్య చాదస్తాన్ని వదలించ దీక్షబూని, త్రిపురనేని