ఈ పుట ఆమోదించబడ్డది

జనాభా పెరుగుదలకూ,సంపదను శక్తిని వినియోగించడానికీ సంబంధం వుంది. ప్రకృతి పరిసరాలపై దీని ప్రభావం పడుతున్నది. కనుక మత గ్రంథాలు ఏంచెప్పినా, క్రమేణా యీ సమస్యల్ని గుర్తించి పరిష్కరించక తప్పదని ఎడ్వర్డ్ విల్సన్ అన్నారు.

తాత్వికంగా పరిశీలిస్తే మానవవాదులు ఫౌకో, డెరిడా, లెటార్డ్ విమర్శల్ని తట్టుకోగలిగారు. వియన్నా తాత్విక సర్కిల్ ను అధిగమించి, సైన్స్ పద్ధతులను వారు స్వీకరించగలిగారు. నిర్ధారణే కావాలని నేడు సైన్స్ కోరుకోవడం లేదు. పరిశీధనలు ఎటు దారి చూపితే అటు పోవడం నేర్చుకున్నారు. కార్యకారణవాదం స్థూల ప్రపంచంలో వున్నదనీ, సూక్ష్మప్రపంచంలో లేదనీ సైన్స్ నిర్ధారించింది. మానవవాదులు అందుకు అంగీకరించక తప్పదుగదా.

కోపర్నికస్ రుజువుల వలన ప్రకృతిలో భూమి చాలా స్వల్పం అనీ,డార్విన్ ఆధారాల వలన మానవుడు పరిణమించిన ప్రాణి అనీ తేలిన తరువాత,మానవవాదులకు వినయం, నమ్రత తప్పదు. మానవ సమస్యల పరిష్కారానికి మానవుడే కేంద్రం అంటారే తప్ప,మరేమీ కాదు.

మానవవాదంపై వచ్చిన విమర్శల దృష్ట్యా కళలు,రామణీయకతలు, కవితల విషయంలోనూ చాలా మార్పులు చేసుకున్నారు. రుజువుకు నిలబడని శక్తుల్ని ఆరాధించడం మానేసి,మానవుడికి ప్రాధాన్యత యిస్తూ ఆనందించే అన్ని కళల్ని పోషిస్తూ పెంపొందించుకుంటున్నారు. అంతేగాక పుట్టిన దగ్గర నుండీ చనిపోయేవరకూ వివిధ దశలలో ఉత్సవాలు, క్రతువులు, పండుగలు చేసుకుంటున్నారు. వీటిలో దైవం బదులు మానవుడే వుంటాడు. మరణించేటప్పుడు ఓదార్పు, అనంతరం బంధుమిత్రులకు వూరట కలిగించే రీతులు కూడా పెంపొందించారు. మతం ఆయా సందర్భాలలో పురోహితుడ్ని ప్రవేశపెట్టగా మానవవాదులు మధ్యవర్తిత్వాల్ని కాదని, సహకార భావంతో క్రతువులు చేస్తున్నారు.

మానవుడిలో పెద్ద బలహీనత మరణమే. అది తలచుకొని భయపడుచున్నకొద్దీ,దాని చుట్టూ చాలా సిద్ధాంతాలు,తత్వాలు అల్లారు. అందులో భాగంగానే అమరత్వం, శాశ్వతత్వం, ఆత్మ, పునర్జన్మ, కర్మ, మోక్షం, నరకం మొదలైనవి వచ్చాయి. ఇంచుమించు అన్ని మతాలు మరణాన్ని ఆసరాగా తీసుకొని మనిషి బలహీనతలపై స్వారీ చేస్తున్నాయి.

మానవవాదులు నిస్సహాయులుగా వున్నంతకాలం మరణం అనే వాస్తవం మనిషిలో ఎన్నో వికారాలు పుట్టిస్తుంది. మరణం సహజమని, తరువాత ఏమీ వుండదని, మనిషి భావాలు తరువాతివారు గుర్తుంచుకోవడం ప్రధానమని నచ్చచెప్పగలగాలి. ఈ విషయమై సుప్రసిద్ధమానవ తాత్వికుడు కార్లిస్ లెమాంట్ చక్కని రచన చేశారు. మరణం పట్ల మానవుడు ఎలాంటి ధోరణి అవలింబించాలో చర్చించారు. నమ్మకాల మధ్య పెరిగేవారికి ఇది కష్టమైన విషయం. అయినా మానవవాదులు చెప్పేది మానవకేంద్రంగా వున్న తత్వమే. మానవవాదంపై ఫౌకో, డెరిడా, లెటార్డ్ చేసిన విమర్శలు నిలిచేవి కావు. మానవుడు దీర్ఘకాలిక పరిణామంలో తాత్కాలిక జీవి కావచ్చు.