ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వం మాత్రం రామమోహన్‌కు యిచ్చిన 'రాజా' బిరుదాన్ని గుర్తించలేదు. (జె.కె.మజుందార్ "రాజరామమోహన్‌రాయ్, అండ్ ది లాస్ట్ మొగల్ పుట 115, 116 పుట 206-207) మొగల్ చక్రవర్తి ప్రతినిధిగా కలకత్తాలో వుంటున్న ఫరీద్‌ఖాన్ చనిపోయాడు. రామమోహన్‌ను ఇంగ్లండు పంపిస్తున్న విషయం ఆయన ప్రభుత్వానికి తెలియజేయవలసి వున్నది. అది జరగలేదు. ఆయన స్థానంలో వచ్చిన ఫజల్‌బేగ్ ప్రభుత్వానికి లోగడ ఫరీద్‌ఖాన్ ఉత్తరం వ్రాసినట్లు దొంగ ఉత్తరం సృష్టించాడు. ఇందుకు రామమోహన్ తోడ్పాటు వున్నది. (పొలిటికల్ ప్రొసీడింగ్స్ 1830 జులై 23 నం. 98)

సతీసహగమనాన్ని ఒక్కసారిగా నిషేధించక, క్రమేణా తొలగించాలని రామమోహన్ ఉద్దేశ్యం. కాని బ్రిటిష్ ప్రభుత్వం 1829 డిసెంబరులో నిషేధశాసనం చేసింది. 1830 జనవరి 14న కలకత్తాలోని 800 మంది ఈ నిషేధానికి వ్యతిరేకంగా గవర్నర్ జనరల్‌కు విజ్ణప్తి చేశారు. అప్పుడు రామమోహన్ మేల్కొని ఇంగ్లండు పోడానికి అదే అవకాశమనుకొని, ప్రీవికౌన్సిల్‌లో సతీసహగమన నిషేధానికి అనుకూలంగా వాదించడానికి తనను ఇంగ్లండు పోనివ్వమని కోరాడు. మొగల్‌చక్రవర్తి ప్రతినిధిగా కాక, వ్యక్తిగతంగా వెడతానంటే ప్రభుత్వం అంగీకరించింది. 1830 నవంబరులో ఇంగ్లండు బయలుదేరాడు. వెళ్ళినవాడు , ప్రీవికౌన్సిల్‌లో సతీసహగమన నిషేధంపై వాదోపవాదాలు పూర్తిగాకముందే ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు. పైగా మొగలాయి చక్రవర్తి పక్షాన కృషిచేస్తూ, ఆయన ప్రసాదించిన 'రాజా' బిరుదును బాగా వాడుకున్నాడు. ఆయన కృషివలన మొగల్‌చక్రవర్తి భరణాన్ని సాలీనా మూడువేల పౌండ్లు పెంచారు కూడా. ఇదంతా ఇండియా ప్రభుత్వ ఆదాయంనుంచి చెల్లించాలన్నారు. అదికూడా చాలదని ఇంకా పెంచమని రామమోహన్ కోరాడు. (డిల్లీలో గవర్నర్ జనరల్ ఏజంటు ప్రభుత్వ పొలిటికల్ సెక్రటరీకి 1830 జులై 18న వ్రాసినలేఖ) ఈవిధంగా ప్యూడల్ చక్రవర్తికి తోడ్పడడంతో మిగిలిన జమీందార్లు కూడా ఎగబడి తమ కష్టాలు తీర్చమన్నారు.గ్వాలియర్ రాణి బైజాబాయి తన రాయబారిగా 1833లో రామమోహన్‌ను నియమించింది. అయోధ్య, మైసూరు రాజులు కూడా యిలాంటి ప్రయత్నమే చేశారు.

1718 నుంచి పండితనందకుమార్ విద్యాలంకార్ వద్ద సంస్కృతం, వేదాభ్యాసం చేశాడు రామమోహన్. రాంనారాయణ అధికారివద్ద స్వగ్రామంలో పర్షియన్, అరబిక్ భాషలు నేర్చాడు. ఇస్లాం ప్రభావంలో ఏకేశ్వరాధన కోరాడు. తన కుటుంబంతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా రామమోహన్ తన తండ్రి శ్రాద్ధకర్మను కలకత్తాలో చేశాడు. ఇది ప్రాచీన వైష్ణవ పద్ధతిలో చేశాడు. చనిపోబోయేముందు తండ్రి రమాక్రాంతుడు తీవ్రమైన అప్పులలో పడ్డాడు. దీనివలన జైలులో పెట్టారు. ఆ అవమానంతో ఆయన చనిపోయాడు. అలాగే అన్నకూడా అప్పుల పాలయ్యాడు. అప్పటికే సంపన్నుడుగావున్న రామమోహన్ వీరిని ఆదుకోడానికి ఏమి చేయలేదు. జైలులో వున్న అన్న జగన్‌మోహన్ తనను విడిపించమని తమ్ముడిని కోరగా, నోటు రాయించుకొని 1804 ఫిబ్రవరి 13 లోగా తిరిగి చెల్లించే షరతుపై వెయ్యి రూపాయలు అప్పుగా యిచ్చాడు.