ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లండ్ లోనూ చదివి రెండేళ్ళు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా పనిచేశాడు. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ లెక్చరర్ గా అనుభవం పొందాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మొనాష్ యునివర్శిటీ ప్రొఫెసర్.

మానవ జీవ నీతి శాస్త్ర కేంద్రం డైరెక్టరుగా పీటర్ సింగర్ ప్రపంచ ఖ్యాతి పొందాడు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంవారు ఆయన్ను సెనేటర్ గా నిలబడమని కోరారు. 1992 నుండీ అంతర్జాతీయ బయో ఎథిక్స్ సంస్థ స్థాపకుడుగా కృషి చేస్తున్నారు. 1985 నుండీ బయో ఎథిక్స్ పత్రిక సహసంపాదకుడు.

ఇప్పుడు పీటర్ సింగర్ ను అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీవారు మానవ విలువలు అధ్యయనం చేసే బయో ఎథిక్స్ కేంద్రంలో ప్రొఫెసర్ గా ఆహ్వానించారు. ఆయన అంగీకరించి చేరారు. కాని ఆయన నియామకాన్ని ప్రశ్నిస్తూ ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో జీవకారుణ్య సంఘాలవారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకని?

పుట్టిన పిల్లలు ఒకనెల లోపు వికలాంగులని, శారీరకంగా తీవ్ర లోపాలు వున్నాయని తెలిస్తే వారిని చంపేయడం మంచిదని పీటర్ సింగర్ అభిప్రాయం. పిల్లలు సుఖ సంతోషాలను యివ్వాలేగాని, తాము బాధపడుతూ, తల్లిదండ్రులకు, సమాజానికి క్షోభ తీసుకొచ్చే రీతిలో పరిణమించరాదని ఆయన ఉద్దేశం. కనుక అలాంటి పిల్లల్ని నెల రోజుల లోపు చంపేస్తేనే అందరికీ మంచిదన్నాడు. దీనిపై హాహాకారాలు బయలుదేరాయి.

గర్భస్రావం అనుమతించాలనీ, తీవ్ర బాధలు భరించలేక ఎవరైనా చనిపోతామంటే వారిని అలా చనిపోనివ్వాలని అందుకు డాక్టర్లు తోడ్పడడంలో తప్పు లేదని పీటర్ సింగర్ వాదించాడు. యూరోప్, అమెరికాలలో పెద్ద చర్చనీయాంశంగా యీ వాదం మారింది.

1968లో పీటర్ సింగర్ రెనాటా డయమంగ్ ను వివాహమాడాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, రచనలతో బాటు, కూరగాయల పెంపకం, ఈత, నడక ఆయన అభిరుచులు.

కోతుల జాతిని సంరక్షించాలనే (Ape Project) పథకంలో విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞుల మద్దత్తు పీటర్ సింగర్ గడించాడు. పరిణామంలో మానవులతో సమంగా వున్న వివిధ కోతి జాతుల్ని ఏ మాత్రం సంహరించరాదని వాదించాడు. కోతి అంగాలు పరిశోధనకు స్వీకరించడం తప్పు కానప్పుడు, మెదడు లేకుండా పుట్టిన శిశువుల అంగాలను తీసుకోవచ్చు గదా అంటున్నాడు.

21వ శతాబ్దంలో కొత్త సూత్రాలు రావాలి. లోగడ టాలమీ విశ్వాసాన్ని కోపర్నికస్ దెబ్బ కొట్టాడు. అతడి లోపాల్ని కెస్లర్ సరిదిద్దాడు. అలాగే ముందుకు సాగడంలో మార్పులు చేసుకోవాలి. ఇందుకుగాను పీటర్ సింగర్ కొత్త నిబంధనలు సూచించాడు. బైబిల్ 10 ఆజ్ఞలు యిప్పుడు మార్చుకోవాలంటున్నాడు. అందులో ముఖ్యమైనవి: