ఈ పుట ఆమోదించబడ్డది

సైకాలజీ కూడా సైంటిఫిక్ అని రుజువు చేయాలని ఆత్రుత పడడంలోనే,సైంటిఫిక్ మెథడ్ లోని గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.

సైన్స్,సంపూర్ణతను, అంతా కనుగొన్నాం అనడాన్ని సుతరామూ ఒప్పుకోదు. సైన్స్ ప్రకారం తెలుసుకోవడం, మార్చుకోవడం,దిద్దుకోవడం నిరంతరం జరిగేపని. పవిత్ర గ్రంథాల పేరిట అంతా అందులోనే వున్నదని సైన్స్ ఏనాటికీ అనదు.అందువలన సైన్స్ మానవాళికి తోడ్పడుతుంది.

పేరా సైకాలజి మానవ అభివృద్దికి దోహదం చేసిన ఉదాహరణ ఒక్కటి లేదు

- మిసిమి మాసపత్రిక,జులై-2001


నేటి తాత్విక విమర్శలు-ధోరణులు

ఇసుకలో ఆడుకుంటూ,సముద్రపు ఒడ్డున బొమ్మలు గీస్తారు. కొందరు ఇసుకమేడలు,కోటలు కడతారు. కాసేపు అవి బాగానే వుంటాయి. ఆ తరువాత అలలు వచ్చి కొట్టుకపోతాయి. ప్రకృతి పరిణామంలో మనిషి కూడా అంతే-ఫ్రెంచి తాత్వికుడు మైకెల్ ఫౌకో(1926-1984) మానవవాదాన్ని దుయ్యబడుతూ చేసిన విమర్శ సారాంశం అది.

మానవ ప్రగతిని పేర్కొంటూ పునర్వికాసం, ఆధునికయుగం అని వర్గీకరించినట్లే, మానవవాదాన్ని కూడా చెబుతున్నారని మైకల్ ఫౌకో(Michel Foucault)అన్నాడు. పునర్వికాసం కొంతకాలం వుండి,తరువాత అంతరించింది. మానవవాదమూ అంతే. ఆధునిక పేరిట మానవవాదులు శాశ్వత తత్వాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. మానవవాదం, ఆధునికత తాత్కాలికాలే.అవి కాలగర్భంలో కలిసిపోతాయి. మైకల్ ఫౌకో విమర్శలకు మరొక ఫ్రెంచి తాత్వికుడు జీన్ ఫ్రాంకో లెటార్డ్(Jean Francois Lyotard) తోడై మానవవాదంపై ధ్వజమెత్తాడు. తత్వాన్ని పరిశీలిస్తే ఏం కనిపిస్తుంది? అన్నీ కథలు,అదిభౌతిక చర్చలు, అస్థిరత్వాన్ని గురించిన చర్చలు అని లెటార్డ్ అన్నాడు. ఆధునిక విజ్ఞానం కూడా అస్థిరత్వాల్ని వెతుక్కుంటూ పోతున్నదన్నాడు. ఫౌకో ఈ అస్థిరత్వ ధోరణిని, మానవవాదాన్ని ఖండించాడు. సైన్స్ బంధంలో మానవుడు చిక్కుకపోయాడనీ, అతడిని విడిపించాలనీ ఫౌకో వాదించాడు. వాస్తవాన్ని ఎదుర్కోలేక మానవవాదులు, ఇతరులపైబడి, అందరినీ పలయనవాదులుగా నిరాశాపరులుగా చిత్రిస్తున్నారన్నాడు.

విశ్వంలో మానవుడు కేంద్రం అంటూ,నీతిశాస్త్రాల్ని సృష్టించే మానవవాదాన్ని ఫౌకో, లెటార్డ్ లు నిరాకరించారు. మానవుడి ప్రగతిని, ఆశావాదాన్ని వర్ణించడమే మానవవాదంగా చూపడాన్ని వారు నిరాకరించారు. మానవశాస్త్రాలన్నీ అస్థిరమైనవిగా వారు చూపారు.