ఈ పుట ఆమోదించబడ్డది

మెక్సికోలో పర్యటించి భారత అనుకూల ప్రచార ప్రసంగాలు చేసినట్లు ఎవిలిన్ తన తల్లికి రాసిన ఉత్తరాలవలన తెలుస్తున్నది. ఎవిలిన్ కూడా యీ ప్రచారంలో పాల్గొన్నది. ఇండియా చూడాలని ఎవిలిన్ ఉవ్విళ్ళూరింది. రాయ్ ఉపన్యాసాల పట్ల మెక్సికోలో సానుభూతి కనబరచారని ఎవిలిన్ పేర్కొన్నది. ఇండియాలో పునర్జన్మ నమ్ముతారనీ,ఆ విషయం తెలుసుకోవాలనీ అనుకున్నది.

ఎం.ఎన్.రాయ్ మెక్సికో నుండి లజపతిరాయ్ తో సంబంధాలు కొన్నాళ్ళు అట్టిపెట్టి 1918 మార్చి 27న కూడా ఒక వ్యాసం పంపాడు. ది యంగ్ ఇండియాలో ప్రచురణార్థం పంపిన ఆ వ్యాసంలో విప్లవ పార్టీ ప్రతినిధిగా తాను రాస్తున్నననీ, ఇండియాకు పూర్తి స్వేచ్ఛ కావాలే గాని, బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా స్వాతంత్ర్యం అక్కరలేదనీ స్పష్టీకరించాడు. భారత స్వాతంత్ర్యంలో అనిబిసెంట్ లాంటివారు ఏనాడు నాయకులుగా చలామణి కాజాలరన్నాడు.

భారతదేశం స్వతంత్రరాజ్యంగా మనజాలదనే లజపతిరాయ్ అభిప్రాయంతో రాయ్ విభేదించి, అది తప్పుడు భావన అన్నాడు. ఇంగ్లండ్ కు కావలసింది భారతదేశంపై ఆర్థిక గుత్తాధిపత్యం గనుక, హోంరూల్ ఇవ్వడంగాని, ఆర్థిక స్వేచ్ఛ ప్రసాదించడంగాని జరగదని రాయ్ రాశాడు. ఇంగ్లండ్ ను ప్రాధేయపడడం మానేసి,దేశపూర్ణస్వరాజ్యానికి నిలబడమని లజపతిరాయ్ ను కోరాడు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయాలనేవారు జర్మన్ కుట్రదారులని ఎలా భావించారని లజపతిరాయ్ ని ప్రశ్నించాడు. ఇండియాలోని 31 కోట్ల జనాభా మనుషులేనంటూ, వారికి హోంరూలుగాని, స్వతంత్రంగాని, మరే పరాయిరాజ్యంగాని అవసరం లేదని ఎం.ఎన్.రాయ్ రాశాడు. విప్లవం మాత్రమే భారతదేశాన్ని విమోచన వైపుకు నడిపించగలదన్నాడు.

లజపతిరాయ్ కు ఉత్తరం జతచేస్తూ, ఆయన అభిప్రాయాలు యంగ్ ఇండియాలో ప్రచురించడానికి అభ్యంతరం వుండదని భావిస్తున్నాడు. అన్ని రకాల అభిప్రాయాలకు యంగ్ ఇండియా చోటివ్వాలన్నాడు.

బరోడిన్ మెక్సికో వచ్చేవరకూ ఎం.ఎన్.రాయ్ ఉగ్రవాదిగానే వున్నట్లు తెలుస్తున్నది. అయితే అమెరికా నుండి వచ్చిన రాడికల్ సోషలిస్టులు, మెక్సికోలోని సోషలిస్టుల సాంగత్యంలో రాయ్ కొంత మారుతూ పోయాడు.

ఎవిలిన్ మెక్సికో నుండి అప్పుడప్పుడూ తన తల్లికి ఉత్తరాలు రాస్తూ విశేషాలు వివరించేది. ఎవిలిన్ మెక్సికోలో వుండగా ఆమె తల్లిదండ్రులు వాషింగ్టన్ ప్రాంతానికి మారారు. ఎవిలిన్ అనేక మారుపేర్లతో వ్యవహరించింది. మార్టిన్, రాయ్ ఎలెన్,ట్రెంట్ యిలా పేర్లు పెట్టుకుంటూ వుండేది. ఎం.ఎన్.రాయ్,ఎవిలిన్ లు జర్మనీ డబ్బువచ్చిన తరువాత పెద్ద బంగళా అద్దెకు తీసుకున్నారు.

బరోడిన్ మెక్సికో వచ్చిన తరువాత ఎం.ఎన్.రాయ్, ఎవిలిన్ లు పూర్తిగా కమ్యూనిస్టులుగా