ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కరణవాదానికి దేశంలో పితామహుడంటే సరిగా వుంటుంది. తన ఏకేశ్వరవాదానికి అనుకూలంగా వుండే ఉపనిషత్ రచనలను ఇంగ్లీషులోకి అనువదించి, ఒకే శక్తి వున్నదనే వాదం బలంగా వున్న ప్రమాణరచనల్ని వదిలేయడం గమనార్హం. ప్రమాణ గ్రంథాల్ని అనువాదాలలో యిలా మార్చేయడం సంస్కర్తలందరూ భారతదేశంలో చేసిన పనే!

42 సంవత్సరాలకే బ్రిటిష్ వారి కొలువుచాలించి ప్రజా సేవకు ఉద్యమించిన రామ్ మోహన్ కలకత్తా చేరారు. అంతవరకూ ఆయన జిల్లాలలో వివిధ ఉద్యోగాలు నిర్వహించి,సాహిత్య, మతరంగాలలో కృషిచేశారు. నాడు కలకత్తా భారతదేశ రాజధాని వివిధ మేధో రంగాలలో కలకత్తా అప్పుడే స్పందిస్తున్నది.

చదువుకుంటున్న కొద్దిమంది మధ్యతరగతి, ఉన్నతవర్గ విద్యార్థులలో కొందరు హిందూ ఆచారాలను, మూఢనమ్మకాలను ప్రశ్నించారు. పాశ్చాత్య చింతనాపరుల గ్రంథాలు చదివి ప్రభావితులైన విద్యార్థులు హిందూమతాన్ని ప్రశ్నించారు. క్రైస్తవ మతప్రచారకుల మద్దత్తు కూడా వీరికి లభించింది. ఇందుకు భిన్నంగా హిందూమతాన్ని రక్షించాలని మరికొందరు పూనుకొన్నారు. అలాంటి సమయంలో, 1815లో రామమోహన్ కలకత్తా చేరుకున్నారు. ఆయన వహించిన కీలకపాత్ర దృష్ట్యా కొంత పూర్వాపరం తెలుసుకోవడం అవసరం.

హిందూమతాన్ని సంస్కరించాలనే ఆయన ప్రయత్నం వలన, బెంగాల్ లో హిందువులు క్రైస్తవులుగా మారిపోకుండా పెద్ద అడ్డుకట్ట వేయగలిగాడు. రామమోహన్ తొలుత ఇస్లాం మతప్రభావంలోకి వచ్చాడు. తరువాత క్రైస్తవమత ప్రభావం క్రిందకు వచ్చాడు. అవి రెండూ రంగరించి హిందూమతంలో జొప్పించే సంస్కర్తగా తేలాడు. అలాగే సంస్కృత భాషాధ్యయనం చేసి, పవిత్ర గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. వేదాలు చదివాడు. పర్షియన్,అరబిక్ భాషలు అభ్యసించాడు. ఖురాన్ చదివి ముస్లిం పండితుల సాంగత్యం చేశాడు. వీటన్నిటి వలన రామమోహన్ ఏకేశ్వరవాది అయ్యాడు. హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలలోని ఏకేశ్వరవాద బలంతో తన సంస్కరణోద్యమాన్ని తలపెట్టాడు. రంగపూర్ లో తన ఉద్యమాన్ని ప్రారంభించి స్నేహితులను కూడగట్టి ఏకేశ్వరారాధన ప్రార్థనలు చేసేవాడు. రంగపూర్ లో వుండగానే ఉపనిషత్తుల్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. వేదాంత గ్రంథం,వేదాంతసారం రాశాడు.

మరొక ఆసక్తికర అంశమేమంటే రామమోహన్ తాంత్రిక విద్య అభ్యసించాడు. హరిహరానంద వద్ద యీ విద్య నేర్చాడు. ఒక ముస్లిం స్త్రీతో కలసి తాంత్రికవిద్యను రంగపూర్ లో ఆచరించిన రామమోహన్ క్రమేణా వేదాంతంలో ఆసక్తి కనబరచాడు. 1788 నుండీ పండిత నందకుమార్ విద్యాలంకార్ వద్ద వేదాంతం నెర్చుకున్నాడు. అరబిక్-పర్ష్యన్ భాషలలో రచనలు చేశాడుకూడా. అన్ని రచనలలోనూ ఏకేశ్వరారాధనపట్ల దృష్టిపెట్టాడు. రంగపుర్ లో దివాన్ గా వుంటూ దిగ్ బీ గ్రంథాలను చదివి,ఇంగ్లీషు పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. మార్టిన్ లూథర్ మత సంస్కరణ ఇతడిని ఉత్తేజపరచింది. తాను కూడా హిందూమతంలో విగ్రహారాధన పోగొట్టి, సరైన