ఈ పుట ఆమోదించబడ్డది

మనిషి దైవంకోసం, మతం కోసం, మోక్షం కోసం బ్రతకాలనే భ్రమ తొలగాలి. ఈ మోసం యిక సాగనివ్వరాదు.

నా మతం గొప్పది, దాని ద్వారానే మోక్షానికి పోతారని, ఏ మతానికి ఆ మతం బోధిస్తున్నది. నేను నమ్మిన దేవుడే సర్వోత్తముడని భక్తులు నమ్ముతారు. మిగిలిన మతాలు, మిగిలిన దేవుళ్ళు తక్కువే అని అర్థం. ఆ దృష్టితోనే మత మార్పిడులు, మత కలహాలు వచ్చాయి. మత దూషణలు-కాఫిర్లు, మ్లేచ్ఛులు, పేగన్లులాంటి మాటలు వచ్చాయి.

కులమూ అంతే. ఎవరికి వారు నా కుల కట్టుబాటు మంచిది అనుకుంటారు. అన్నిటికంటె ఉత్తమమైన బ్రాహ్మణకులం వైపుకు యెదగాలని ప్రయత్నిస్తూ సంస్కృతీకరణ చేశారు. ఇదీ మతపరంగానే వచ్చింది.

మతం, కులం కట్టుబాట్లు లేకుంటే మానవుడు కట్టలు తెంచిన స్వేచ్ఛతో అరాచకత్వం సృష్టిస్తాడని భయపెట్టి, స్వర్గం, పాపం, నరకం, దేవుడు, మతం, కులం అనే భయంకర అమానుష ఆయుధాలు వాడారు.

మనిషి స్వేచ్ఛాపిపాసి. హేతుబద్దుడుగా ఆలోచించి,నిత్యమూ తెలుసుకుంటాడు. ఈ అన్వేషణలో ఇతరుల సహకారం స్వీకరిస్తాడు. ప్రకృతిలో మానవుడు సహకారజీవి. అతడి సహకార లక్షణాన్ని మతం, కులం చంపేశాయి. అసహనం పెంచాయి. దురభిమానానికి పాలుపోశాయి. మానవతత్వం మనుగడ సాగించాలంటే మతం, కులం పోవాలి. ఆలోచనను చంపేసే నమ్మకాలు కుల, మత, ఛాందసాలు నాశనం చేయాలి. అవి చరిత్రగా మిగలాలి. వాటికి వాస్తవికతను ఆపాదించిన దోషం తొలగించాలి. ఇదీ మన కర్తవ్యం. ఇందుకు శాస్త్రీయపద్ధతి ఒక్కటే ఆయుధం.

- హేతువాది, జనవరి 1992
చిట్కా వైద్యంలో కొత్త రష్యా డాక్టర్లు

రష్యాలో తిరుగుబాటు వచ్చి కమ్యూనిజం పోయిన తరువాత కొన్ని వివాదాలు తలెత్తాయి. అందులో మతఛాందసం ఒకటికాగా, అద్భుత చికిత్సకారులు మరొక ప్రక్క బాగా వ్యాపారం చేస్తున్నారు. అలాంటివారిలో ఇటీవల వ్లాడిమర్ మాక్సిమోవ్ (Vladimor Maximov) ఒకరు. మూఢనమ్మకాలకు, మతవిశ్వాసాలకు, అద్భుతచికిత్సల పేఠిక మోసాలకు పేరెన్నికగన్న వెనుకబడిన ప్రాంతం రష్యాలోని సైబీరియా. మాక్సిమోవ్ అక్కడే యీ చికిత్సల చిత్రాలు నేర్చాడు. ఆయన వయస్సు 38. గత సంవత్సరం ఆయన అమెరికా వెళ్ళాడు. ప్రస్తుతం అక్కడ తన వ్యాపారాన్ని విస్తృతపరుస్తున్నాడు. అమెరికాలో చదువుకున్న జనానికి తీరిక, ఓపికలేక, మూఢవిశ్వాసాలతో జబ్బుల్ని నయం చేసుకోవాలనే మనస్తత్వం వ్యాపిస్తోంది. ఆ ధోరణిని మతవాదులు బాగా