పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఆ నిర్ణయం జరిగింది" అన్నాడు అతడు. "ఉపాధ్యక్షుణ్ని కనుక నన్ను ఫిలడల్ఫియాకు మారుస్తారు."

"నా తరువాత వచ్చే జనరల్ మేనేజరు మిస్టర్ లూయీ."

అతడు మాట్లాడుతున్నంతసేపు ఆండ్రూ నరాలు బిగుసుకు పోతున్నవి.

"ఇక నీ విషయం ఫిట్సుబర్గు డివిషనుకు సూపరింటెండెంటు అయిన మిస్టర్ పాట్స్‌ను ఫిలడల్ఫియాలోని ట్రాన్ప్సేర్టేషను శాఖాకు ప్రమోటు చేస్తున్నారు. ఆస్థానాన్ని నీ కివ్వవలసిందని నేను ప్రెసిడెంటుకు రిక మెండు చేశాను. పశ్చిమ శాఖను నీవు నడపగలవా ?" అన్నాడు. చిట్టచివరకు అతని పై అధికారి.

ఆండ్రీకి క్షణకాలం తలతిరిగిపోయింది. విజయం, అభివృద్ధి అన్న రెండూ, దరిదాపుగా నిశ్చతమన్నంత వరకూ, ఆత్మవిశ్వాసాన్ని కల్పించాయతనికి. అతనికి ఇరవై నాలుగో జన్మదినం ఇంకా కొద్ది రోజూలకుగాని రాదు. తాను కేవలం రాజకీయజ్ఞుడు, అనుభవరహితుడు అయినప్పటికీ తీసుకోమంటే మర్నాడేచానల్ ఫ్లీట్‌మీద ఆధిపత్యాన్ని పుచ్చుకొంటాడని లార్డు జాన్ రస్సెల్‌ను గురించి చెప్పుకొనే విషయాన్ని స్మృతికి తెచ్చుకున్నాడు. బ్రూస్ గాని వాలెస్ లుగాని ఇలాగే ప్రవర్తించేవాళ్లు...

"నడపగలను" అని "నడపగలనని భాగా ఎరుగుదు" నన్న అభిప్రాయాన్ని నిగూఢంగా అనుసంధించి సమాధానం చెప్పాడు.